గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (11:54 IST)

కరోనాతో ఉద్యోగం ఊడితే.. అదృష్టం అలా వరించింది...

కరోనా కారణంగా ఉద్యోగం ఊడింది. నోటీస్ పీరియడ్ కింద పనిచేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో అతడిని అదృష్టం వరించింది. లాటరీ రూపంలో కోట్లు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కసర్‌గాడ్‌కు చెందిన నవనీత్‌ సజీవన్‌ (30) నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు. అక్కడే ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. కోవిడ్‌ నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా గత నెలలో ఆయనను ఉద్యోగం నుంచి తీసివేశారు.
 
నోటీసు పీరియడ్‌లో పని చేస్తున్న ఇతను ఒక మిలియన్‌ డాలర్ల లాటరీ (సుమారు రూ.7.4 కోట్లు)ని గెలుచుకున్నట్టు ఆదివారం దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్‌ డ్రా నిర్వాహకులు తెలిపారు. ఈ మాట విన్న అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 
 
నవంబరు 22న ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్‌ను నవనీత్‌ కొనుగోలు చేశాడు. కష్టాల్లో ఉన్న తరుణంలో లాటరీ రావడం నమ్మశక్యంగా లేదని, తాను ఎంతో అదృష్టం చేసుకున్నానని, ఇప్పుడెంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తనకు వచ్చిన సొమ్ములో కొంత మొత్తాన్ని సహోద్యోగులు, స్నేహితులకు ఇవ్వనున్నట్టు చెప్పారు.