శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (08:58 IST)

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి.. వందమందికి గాయాలు

Train
Train
పాకిస్థాన్‌లో సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో 30 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో ఆదివారం నాడు ప్యాసింజర్ రైలులోని కనీసం పది బోగీలు పట్టాలు తప్పడంతో కనీసం 30 మంది ప్రయాణికులు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. 
 
ప్రాణనష్టాన్ని ధృవీకరిస్తూ, సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా మాట్లాడుతూ, తొమ్మిది కార్లను క్లియర్ చేశామని, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం దక్షిణ ఓడరేవు నగరమైన కరాచీకి తరలించినట్లు వెల్లడించారు.
 
దాదాపు 16 నుండి 17 బోగీలతో 1,000 మంది ప్రయాణికులు ఉన్న హజారా ఎక్స్‌ప్రెస్ రైలు, కరాచీ నుండి దేశంలోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌కు వెళ్లే మార్గంలో కాలువ వంతెనను దాటుతుండగా ట్రాక్‌పై నుండి పక్కకు తప్పుకుంది. దీంతో ఈ ఘోరం జరిగిపోయిందని రైల్వే శాఖ మంత్రి ఖవాజా సాద్ రఫీక్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 
 
ఇంకా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, రెస్క్యూ టీమ్‌లు, పాకిస్థాన్ ఆర్మీ, పాకిస్థాన్ రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. స్థానిక వాలంటీర్లు కూడా బోగీల కింద చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించడంలో సహాయపడ్డారు.