ఫిలిప్పీన్స్‌లో లాక్‌డౌన్ .. వీధులు - రోడ్లపై కనిపిస్తే కాల్చి చంపండి?!
కరోనా వైరస్ నుంచి తమ తమ ప్రజలను కాపాడుకనేందుకు అనేక దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే, ఎన్నో రకాలైన కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయితే, కొన్ని దేశాల్లో ప్రజలు మాత్రం ఈ లాక్‌డౌన్ నిబంధనలు యధేచ్చగా అతిక్రమిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ అధినేత రొడ్రిగో డ్యూటెర్టే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను జారీచేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కాల్చి చంపండి అంటూ పోలీసులు, మిలిటరీ అధికారులను రోడ్రిగో ఆదేశించారు.
లాక్‌డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితం కావాలని ఆయన ఆదేశించారు. అపుడే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎవరూ బయటకు రావద్దని ఆయన సూచించారు.
అయితే ఖాతరు చేయకుంటే కాల్చి చంపండి అన్న రోడ్రిగో ఆదేశాలపై మానవహక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. నెటిజన్లు సైతం రోడ్రిగో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా, కరోనా తీవ్రత దృష్ట్యా అధ్యక్షుడు అలా మాట్లాడారని, పోలీసులు, మిలిటరీ వాళ్లు ఎవరినీ షూట్ చేయరని ఫిలిప్పీన్స్ పోలీస్ చీఫ్ వివరణ ఇచ్చారు.