మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (10:57 IST)

హార్దిక్ పాండ్యా అదరగొట్టినా.. ముంబై ఓటమి.. కేకేఆర్ కేక..

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌలర్లు కనిపిస్తే చాలు పాండ్యా చిర్రెత్తికొచ్చినట్లు బ్యాటింగ్ చేశాడు. స్టేడియం చుట్టు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. తద్వారా ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను చూపెట్టాడు. 
 
కోల్‌కతా నిర్దేశించిన 233 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ముంబై కేకేఆర్‌కు చుక్కలు చూపించింది. హార్దిక్ పాండ్యా దెబ్బకు ఓ దశలో గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. లక్ష్యఛేదనలో త్వరత్వరగా వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టుకు పాండ్యా ఆపద్బాంధవుడయ్యాడు. ఫోర్లు, సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. 
 
తొలుత 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పాండ్యా ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన అర్థసెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాతి 17 బంతుల్లో మరో 41 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో మొత్తం 34 బంతులు ఎదుర్కొన్న పాండ్యా 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు. కాగా, మార్చి 24న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఇప్పుడా రికార్డును పాండ్యా తిరగరాశాడు. అయితే పాండ్యా ధీటుగా ఆడినా ముంబైకి ఓటమి తప్పలేదు. ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులకే పరిమితమైంది. దీంతో కీలక మ్యాచ్‌లో కోల్‌కతా గెలుపొందింది.
 
వరుసగా ఆరు పరాజయాల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సగర్వంగా తలెత్తుకునే ప్రదర్శన కనబరిచింది. శుభ్‌మన్‌ గిల్‌, క్రిస్‌ లిన్‌ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా కేకేఆర్ భారీ స్కోర్ సాధించింది. శుభ్‌మన్‌ గిల్‌(76; 45బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), క్రిస్‌ లిన్‌(54; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌( 80 నాటౌట్‌; 40 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు)లు విధ్వంసకర బ్యాటింగ్‌ చేయడంతో కేకేఆర్‌ 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై జట్టు 34 పరుగుల తేడాతో ఓటమి చెందింది.