శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (10:47 IST)

మిస్టర్ కూల్ ధోనీ కాదు.. కోపం వస్తే ఉగ్రనరసింహుడు...

ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశాంతంగా ఉంటాడు. అదే కోపం వస్తే మాత్రం ఉగ్రనరసింహుడేనని తాజాగా నిరూపించాడు. తనకు కోపం వస్తే ఎలా ఉంటుందో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్‌ దీపక్ చహార్‌కు చూపించాడు. 
 
ప్రస్తుత ఐపీఎల్‌లో కీలక సమయాల్లో మహేంద్రుడు దీపక్ చహార్‌పైనే ఆధారపడుతున్నాడు. చహార్ కూడా కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మైదానంలో రాణిస్తుంటాడు. శనివారం చెన్నైలో జరిగిన మ్యాచ్ లో 19వ ఓవర్ వేయడానికి వచ్చిన దీపక్‌కి ధోనీ గట్టి క్లాస్ తీసుకున్నాడు. 
 
గెలిచేందుకు పంజాబ్ జట్టుకి 12 బంతుల్లో 39 పరుగులు కావాలి. ఓవర్ ప్రారంభంలోనే వరుసగా చహార్ నోబాల్స్ వేశాడు. నడుంపైకి ఫుల్ టాస్‌లు వేయడంతో రెండు ఫ్రీ హిట్స్ వచ్చాయి. దీంతో చిర్రెత్తిపోయిన ధోనీ బౌలర్ దగ్గరకు వెళ్లి సీరియస్ క్లాస్ పీకాడు.
 
బౌలింగ్‌కి వచ్చినపుడు భయపడుతున్నట్టు కనిపించిన చహార్, ధోనీ సలహా తర్వాత మెరుగ్గా బౌలింగ్ చేశాడు. తన ఓవర్ చివరి బంతికి ప్రమాదకరమైన డేవిడ్ మిల్లర్ వికెట్ తీశాడు. ఆ ఓవర్‌లో 13 పరుగులు మాత్రమే రావడంతో పంజాబ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయభేరీ మోగించింది.