సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (09:48 IST)

ధోనీకి గంగూలీ సపోర్ట్.. సెహ్వాగ్ ఫైర్.. భారత జట్టు కోసం కోప్పడి ఉంటే బాగుండేది..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వైఖరిని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెనకేసుకొచ్చాడు. గత వారంలో మైదానంలోకి దూసుకొచ్చి, అంపైర్లతో వాదనకు దిగి, తీవ్ర చర్చనీయాంశమైన ధోనీ వైఖరిని సమర్థించాడు. ఏదో ఒక చిన్న ఘటన కారణంగా ధోనీని తక్కువ చేసి మాట్లాడరాదని అన్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ధోనీ సాధించిన విజయాలను మరువరాదని తెలిపాడు. 
 
కాగా, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న గంగూలీ అభిప్రాయం ఒకలా ఉంటే, మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ మరోలా స్పందించాడు. ధోనీపై 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా ఏ మాత్రం సరిపోదని, అతనిపై కనీసం రెండు లేదా మూడు మ్యాచ్‌‌లు నిషేధం విధిస్తే, మరొకరు ఇలా చేయకుండా హెచ్చరించినట్టు అయ్యేదని తెలిపాడు. 
 
కాగా.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పిచ్ వద్దకు దూసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంపైర్ నోబాల్ ఇచ్చి, ఆపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గమనించిన ధోనీ బౌండరీ లైన్ ఆవల నుంచి ఎంతో ఆవేశంతో పిచ్ వద్దకు వచ్చి అంపైర్లతో వాగ్వివాదం పెట్టుకోవడం తెలిసిందే. 
 
కెప్టెన్ కూల్‌గా పేరుగాంచిన ధోనీ ఇలా చిన్న విషయానికి క్రీడాస్ఫూర్తిని మర్చిపోయి వ్యవహరించాడంటూ మాజీ క్రికెటర్లు సైతం మండిపడుతున్నారు తాజాగా, ధోనీ ఒకప్పటి సహచరుడు వీరేంద్ర సెహ్వాగ్ దీనిపై విమర్శనాత్మక శైలిలో వ్యాఖ్యానించారు.
 
ధోనీ టీమిండియా కోసం ఏనాడూ ఇంత ఆవేశం చూపించలేదని, భారత జట్టు కోసం కోప్పడి ఉంటే తాను ఎంతో సంతోషించేవాడ్నని తెలిపారు. చివరికి ఓ ఐపీఎల్ జట్టు కోసం కోపం ప్రదర్శించాడని పేర్కొన్నారు.