బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (09:31 IST)

బోణీ కొట్టేదెవరో? ... నేడు కోల్‌కతా వర్సెస్ ముంబై

ఐపీఎల్ టోర్నీలో మరో రసవత్తరమైన మ్యాచ్‌‌ బుధవారం జరుగనుంది. ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తలపడనుంది. ఆరంభ మ్యాచ్‌లో ఊహించని విధంగా ఖంగుతిన్న డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌లో బోణీ చేయాలన్న పట్టుదలతో ఉంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో రోహిత్‌సేన.. దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. 
 
బ్యాటింగ్‌లో ఇరుజట్లూ సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌ బ్యాట్స్‌మెన్‌ మధ్య సమరంగా సాగే అవకాశం ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా లాంటి టీమిండియా ఆటగాళ్లతో ముంబై పటిష్ఠంగా కనిపిస్తోంది. మరోవైపు కోల్‌కతా తమ తొలి మ్యాచ్‌లోనే నెగ్గి శుభారంభం చేయాలనుకుంటోంది. ఆ జట్టు యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. కాగా, విండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఆండ్రీ రస్సెల్‌ టాపార్డర్‌లో ఆడనుండడం నైట్‌రైడర్స్‌కు ప్లస్‌ కానుంది. బౌలింగ్‌లో కమిన్స్‌ పెద్దదిక్కుగా ఉన్నాడు. 
 
ఐపీఎల్ టోర్నీలో 5వ మ్యాచ్‌ ఇది. ఇది షేక్ జయాద్ స్టేడియంలో జరుగనుంది. రెండు జట్లలోనూ అగ్రశ్రేణి క్రికెటర్లకు కొదవలేదు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇయాన్ మోర్గాన్ చేరికతో కోల్‌కతా చాలా బలంగా మారింది. అంతేగాక టి20 స్పెషలిస్ట్‌లు సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ ఉండనే ఉన్నారు. 
 
కెప్టెన్ దినేశ్ కార్తీక్, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్, నితీష్ రానా తదితరులతో కోల్‌కతా బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. ఇక, ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్న పాట్ కమిన్స్ రూపంలో పదునైన అస్త్రం కోల్‌కతాకు అందుబాటులో ఉంది. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయిన క్రికెటర్‌గా కమిన్స్ నిలిచాడు. కొంతకాలంగా ఆస్ట్రేలియా విజయాల్లో కమిన్స్ కీలక భూమికను పోషిస్తున్నారు. 
 
దీంతో కమిన్స్ భారీ మొత్తం ధరకు కోల్‌కతా కొనుగోలు చేసింది. ఈసారి రసెల్, కమిన్స్‌ల కోల్‌కతా భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా రసెల్‌కు ఉంది. ఇప్పటికే ఐపిఎల్‌లోనే అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా రసెల్ పేరు తెచ్చుకున్నాడు. అతను విజృంభిస్తే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఇటీవల ముగిసిన కరీబియన్ లీగ్‌లో కూడా రసెల్ మెరుపులు మెరిపించాడు. అతను ఫామ్‌లో ఉండడం కోల్‌కతాకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. 
 
ఇక కెప్టెన్ దినేశ్ కార్తీక్‌కు కూడా టి20లలో మంచి రికార్డు ఉంది. గతంలో శ్రీలంకతో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో కార్తీక్ ఆడిన విధ్వంసక ఇన్నింగ్సే అతని ప్రతిభకు నిదర్శనంగా చెప్పక తప్పదు. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కూడా ఈసారి ఐపిఎల్‌లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ టోర్నీలో రాణించడం ద్వారా టీమిండియాలో స్థానాన్ని సద్వినియోగం చేసుకోవాలని గిల్ తహతహలాడుతున్నాడు. 
 
ఇక నితీష్ రానా కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్ స్టార్ ఇయాన్ మోర్గాన్ రాకతో కోల్‌కతా బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారింది. అంతేగాక సీనియర్ ఆటగాడిగా అతను అందించే సలహాలు, సూచనలు జట్టుకు ఉపయుక్తంగా ఉంటాయని చెప్పక తప్పదు. కుల్దీప్ యాదవ్, రింకు సింగ్, రాహుల్ త్రిపాఠి, సిద్ధార్థ్ లాడ్, ఫెర్గూసన్ తదితరులతో కోల్‌కతా చాలా బలంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లోనే గెలిచి ఆత్మవిశాసాన్ని రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది.
 
మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి పాలైంది. గెలిచే స్థితిలో ఉండి కూడా మ్యాచ్‌ను చేజార్చుకుంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైన గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. రోహిత్ శర్మ, పొలార్డ్, బుమ్రా, పాండ్య బ్రదర్స్, బౌల్ట్, సౌరభ్ తివారి తదితరులతో ముంబై చాలా బలంగా ఉంది. చెన్నైతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ముంబై బాగానే ఆడినా ఓటమి తప్పలేదు. 
 
ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే పట్టుదలతో కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు. మరో ఓపెనర్ డికాక్ తొలి మ్యాచ్‌లో బాగానే ఆడాడు. అయితే బుమ్రా, హార్దిక్ తదితరులు తొలి మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ రాణిస్తే కోల్‌కతాను ఓడించడం ముంబైకి పెద్ద కష్టమేమి కాదు.