సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2020 (14:25 IST)

ఐపీఎల్ 2020 : కోల్‌కతాపై శ్రేయాస్ విధ్వంసం - ఢిల్లీ గెలుపు

ఐపీఎల్ టోర్నీలో భాగంగా, శనివారం రాత్రి జరిగిన 16వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యార్ విధ్వంసం సృష్టించాడు. శనివారం ఇక్కడ పరుగుల వరద పారిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని అధిష్టించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ ‌(38 బంతుల్లో 88, 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), ఓపెనర్‌ పృథ్వీ షా(41 బంతుల్లో 66, 4ఫోర్లు, 4సిక్స్‌లు) వీరవిహారం చేయడంతో పాటు రిషబ్‌ పంత్ ‌(17 బంతుల్లో 38, 5 ఫోర్లు, ఓ సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. కోల్‌కతా బౌలర్లలో అండ్రీ రసెల్‌కు రెండు, వరుణ్‌ చక్రవర్తి, నాగర్‌కోటికి చెరో వికెట్‌ దక్కగా.. స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ వికెట్‌ లేకుండా 49 పరుగులు సమర్పించుకున్నాడు. 
 
ఆ తర్వాత 229 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. నితీశ్‌ రాణా(35 బంతుల్లో 58, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థశతకం సాధించగా ఇయాన్‌ మోర్గాన్‌ (16 బంతుల్లో 36, ఓ ఫోర్‌, ఐదు సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినా ఫలితం లేకపోయింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 210 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే మూడు, హర్షల్‌ పటేల్‌ రెండు వికెట్లతో రాణించారు. బ్యాటింగ్‌లో అదగరొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.