శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఏప్రియల్ 2021 (15:10 IST)

క్యాచ్ కోసం పక్కకి డైవ్ చేసిన ధోనీ.. బంతి చేతుల్లో పడినా..? (video)

ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓటముల పరంపర తప్పట్లేదు. ఢిల్లీ వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(44 బంతుల్లో 12 ఫోర్లతో 75), ఫాఫ్ డూప్లెసిస్(38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో చెన్నై 9 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. 
 
ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 171 రన్స్ చేసింది. మనీష్ పాండే(46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 61), డేవిడ్ వార్నర్( 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో కేన్ విలియమ్సన్(10 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 రన్స్ చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. 
 
ఈ విజయంతో చెన్నై పాయింట్స్ టేబుల్లో టాప్‌లోకి దూసుకెళ్లగా.. సన్‌రైజర్స్ ఆఖరి ప్లేస్‌లో కొనసాగుతుంది. ఇక, ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర విషయం జరిగింది. నిన్న మ్యాచ్‌లో మాత్రం ఓ సులువైన క్యాచ్‌ని ధోనీ పట్టలేకపోయాడు. దీంతో చెన్నై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 
దీపక్‌ చహర్‌ వేసిన రెండో బంతికే స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టోను అవుట్‌ చేసే అవకాశం ఎంఎస్ ధోనీకి వచ్చింది. కానీ బంతి దిశను సరిగ్గా అంచనా వేయలేక మహీ పూర్తిగా ఎడమ వైపునకు రావడంతో అతడి చేతుల్లో పడినట్లే పడి కింద పడిపోయింది. దీంతో బెయిర్‌స్టోకు లైఫ్‌ లభించింది. లెగ్ స్టంప్‌కి సమీపంలో వెళ్తున్న బంతిని ఫైన్ లెగ్ దిశగా ప్లిక్ చేసేందుకు బెయిర్‌స్టో ప్రయత్నించాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి వెనక్కి వెళ్లింది. 
 
క్యాచ్ కోసం పక్కకి డైవ్ చేసిన ధోనీ.. బంతి చేతుల్లో పడినా పట్టుకోలేకపోయాడు. అతని గ్లౌవ్స్ నుంచి బౌన్స్ అయిన బంతి కింద పడిపోయింది. ధోనీ అంత సులువైన క్యాచ్‌ని చేజార్చడంతో చాహర్ సీరియస్‌గా అతనివైపు కాసేపు చూశాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో శామ్ కరన్ బౌలింగ్‌లో చహర్‌కి క్యాచ్ ఇచ్చి బెయిర్‌స్టో ఔటయ్యాడు. మహీ క్యాచుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.