శనివారం, 2 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (19:30 IST)

ఐపీఎల్ : రవీంద్ర జడేజా వీరబాదుడు.. బెంగుళూరు దూకుడుకు బ్రేక్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే ఓవర్‌లో అత్య‌ధిక ప‌రుగులు న‌మోదు చేసిన క్రికెటర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా రికార్డుపుటలెక్కాడు. ఈ రికార్డు ఇప్పటివరకు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్‌ పేరిట ఉండేది. ఆయన గత 2011లో నమోదు చేశాడు. ఇపుడు రవీంద్ర జడేజా సమం చేశాడు. 
 
చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాట్స్‌మ‌న్ ర‌వీంద్ర జ‌డేజా వీర‌బాదుడుతో ఒకే ఓవ‌ర్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బౌల‌ర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ 37 ప‌రుగులను సమర్పించుకున్నారు. చెన్నై చివ‌రి ఓవ‌ర్‌లో జ‌డేజా ఏకంగా 5 సిక్స‌ర్లు, ఒక ఫోర్ బాదాడు. రెండు రన్స్ తీశాడు. అలాగే, పైగా హ‌ర్ష‌ల్ ఒక నోబాల్ కూడా వేయ‌డంతో చివ‌రి ఓవ‌ర్‌లో 37 ప‌రుగులు రావ‌డం విశేషం. జ‌డేజా కేవ‌లం 28 బంతుల్లో 62 ప‌రుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్ల ఉన్నాయి.
 
అంతకుముందు.. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి ఆల్‌రౌండ్‌ షోతో మెరిసింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన చెన్నై 69 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. 
 
రవీంద్ర జడేజా బ్యాట్‌, బంతితో రాణించి చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు. 192 పరుగుల భారీ ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులకే పరిమితమైంది.
 
దేవదత్‌ పడిక్కల్‌(34: 15 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో విఫలమైన కోహ్లీ సేన టోర్నీలో తొలిసారి ఓటమిపాలైంది. 
 
ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(8), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(22), ఏబీ డివిలియర్స్‌(4) చేతులెత్తేశారు. చెన్నై బౌలర్లలో జడేజా(3/13), ఇమ్రాన్‌ తాహిర్‌(2/16) బెంగళూరును కుప్పకూల్చారు.
 
అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఆరంభంలో డుప్లెసిస్‌(50: 41 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌), ఆఖర్లో రవీంద్ర జడేజా(62 నాటౌట్‌: 28 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) వీరవిహారం చేశాడు. 
 
హర్షల్‌ పటేల్‌ వేసిన 20వ ఓవర్లో జడేజా వరుసగా 6 6, నోబాల్, 6, 6, 2, 6, 4 బాదడంతో ఒకే ఓవర్లో 37 పరుగులు వచ్చాయి. జడ్డూ వీరవిహారం చేయడంతో చెన్నై అనూహ్యంగా 190 మార్క్‌ దాటింది.
 
రుతురాజ్‌ గైక్వాడ్‌(33: 25 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌), సురేశ్‌ రైనా(24: 18 బంతుల్లో 1ఫోర్‌, 3సిక్సర్లు) ఆకట్టుకున్నారు. మొదటి మూడు ఓవర్లను కట్టుదిట్టంగా వేసి మూడు వికెట్లు తీసిన హర్షల్‌(3/51).. చివరి ఓవర్లో దారుణంగా తేలిపోయాడు. జడేజా విధ్వంసానికి పటేల్‌ చేతులెత్తేశాడు. చాహల్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.