ఐపీఎల్ 14వ సీజన్.. దసరా రోజే ఫైనల్.. 31 మ్యాచ్‌లు పెండింగ్
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ ఎడిషన్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన టోర్నీ యూఏఈలో జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ దసరా రోజు అంటే అక్టోబర్ 15న జరగనుంది.
ఇప్పటికే బీసీసీఐ అధికారులు యూఏఈ బోర్డుతో సమావేశమయ్యారు. ఈ సమావేశం బాగా జరిగిందని, మిగిలి మ్యాచ్‌లను దుబాయ్, అబుదాబి, షార్జాల్లో విజయవంతంగా నిర్వహిస్తామన్న విశ్వాసం బీసీసీఐలో ఉందని బోర్డు అధికారి ఒకరు ఏఎన్ఐకి వెల్లడించారు. ఇప్పటికే 29 మ్యాచ్‌లు పూర్తయిన ఐపీఎల్‌లో మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
దీనికోసం కనీసం 25 రోజుల సమయం దొరికినా చాలు.. టోర్నీని పూర్తి చేస్తామని బోర్డు చెబుతూ వస్తోంది. ఇండియాలో ఎలాగూ సాధ్యం కాదని భావించి టోర్నీని యూఏఈకి తరలించారు. అయితే మిగిలిన టోర్నీకి పలువురు విదేశీ స్టార్ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు కనపించడం లేదు. చాలా వరకూ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ఎవరైనా రాకపోతే అప్పుడు చూస్తామని సదరు బీసీసీఐ అధికారి చెప్పారు.