మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (11:18 IST)

బెంగుళూరుకు గట్టి షాక్.. ఐపీఎల్ నుంచి రీస్ టాప్లీ ఔట్

Kolkata
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. గురువారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. అదేసమయంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన రీస్ టాప్లీని స్వదేశానికి పంపించాలని ప్రధాన కోచ్ సంజయ్ బంగర్ సూచించారు. ఆయన భుజం ఎముక స్థానభ్రంశం చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో టాప్లీని ఈ టోర్నీ మొత్తానికి దూరంకానున్నారు. 
 
కాగా, టాప్లీ గాయపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో పలుమార్లు గాయపడ్డాడు. దీంతో టాప్లీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. గత ఐదేళ్లలో నాలుగుసార్లు అతడి వెన్నుకు గాయాలయ్యాయి. 2015లో అరంగేట్రం చేసిన టాప్లీ 22 వన్డేల్లో 33 వికెట్లు తీశాడు. ఇపుడు టాప్లీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. 
 
మరోవైపు గత రాత్రి కోల్‌‍కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు దారుణంగా ఓడిపోయింది. కోల్‌కతా నిర్ధేశించిన 205 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకిదిగిన బెంగుళూరు జట్టు 17.4 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. దీంతో 81 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 
 
అంతకుముందు కోల్‌కతా జట్టులో గుర్బాజ్ (57), లింకు సింగ్ (46), శార్ధూల్ ఠాకూర్ (68) వంటి బ్యాటర్లు రెచ్చిపోవడంతో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత బెంగుళూరును కోల్‌కతా స్పిన్నర్లు కుప్పకూల్చారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడిన బెంగుళూరు బ్యాటర్లు చివరకు 123 పరుగులకే చేతులెత్తేశారు. మ్యాచ్ ప్రారంభం నుంచి మ్యాచ్ ముగిసేంత వరకు వికెట్ల పతనం కొనసాగింది.