ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జూన్ 2022 (15:31 IST)

స్పామ్ - ఫేక్ ఖాతా లెక్కలు ఇవ్వాల్సిందే.. లేదంటే డీల్ క్యాన్సిల్ : ఎలాన్ మస్క్

elon musk
ట్విట్టర్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఒప్పంద ప్రక్రియ ముందుకు సాగాలంటే నకిలీ ఖాతాలకు (స్పామ్‌, ఫేక్‌ అకౌంట్లు) సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించకుంటే ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకొంటానని అమెరికా టెక్ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ హెచ్చరించారు. 
 
ముఖ్యంగా తాను లేవనెత్తిన అంశాలపై సమాచారాన్ని ఇవ్వకుండా ట్విట్టర్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు. ఇలాగే కొనసాగితే విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు తనకు అన్ని హక్కులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్‌ సంస్థకు ఎలాన్‌ మస్క్‌ లేఖ రాశారు.
 
'విలీన ఒప్పందంలో భాగంగా ఎలాన్‌ మస్క్‌ లేవనెత్తిన అంశాలపై పూర్తి సమాచారాన్ని ఇచ్చేందుకు ట్విట్టర్‌ నిరాకరిస్తోంది. ఎలాన్‌ మస్క్‌ తన విశ్లేషణతో వాస్తవాలను బయటపెడతారనే ఆందోళనతోనే ట్విట్టర్‌ సమాచారాన్ని దాచిపెడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం పొందేందుకు మస్క్‌కు ఉన్న హక్కులను సంస్థ అడ్డుకుంటోంది' అని ట్విట్టర్‌కు రాసిన లేఖలో ఎలాన్‌ మస్క్‌ న్యాయవాది పేర్కొన్నారు.
 
ఇదిలా ఉంటే, సామాజిక దిగ్గజ సంస్థ ట్విటర్‌ను సొంతం చేసుకునేందుకు 44 బిలియన్‌ డాలర్లతో ఎలాన్‌ మస్క్‌ డీల్‌ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కొనుగోలు ఒప్పందం ఖరారు చేసుకున్నప్పటికీ నకిలీ ఖాతాల విషయంలో ఎలాన్‌ మస్క్‌ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్‌ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్‌ ముందుకు వెళ్లదని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన తాజాగా స్పష్టం చేశారు.