గూగుల్‌కు భారీ అపరాధం.. ఫ్రాన్స్ కఠిన చర్యలు
ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌కు భారీ అపరాధాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం విధించింది. వార్తల ప్రచురణ విషయంలో స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోకుండా, వాటి కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా వాడుకుంటుంది. దీనికి భారీ అపరాధం విధించింది.
గూగుల్‌కు చెందిన గూగుల్ న్యూస్ పేజ్‌లో తమ కంటెంట్‌ను అనుమతి లేకుండా వినియోగిస్తున్నారంటూ అనేక ఫ్రెంచ్ మీడియా సంస్థలు గూగుల్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఫ్రాన్స్ ప్రభుత్వ అధీనంలోని యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ గూగుల్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించింది.
అయితే, గూగుల్‌కు ఓ అవకాశం ఇవ్వాలని భావించి, స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ ఆదేశించింది. కానీ ఈ ఆదేశాలను గూగుల్ పెడచెవిన పెట్టడంతో రెగ్యులేటరీ భారీ జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది.
దీంతో గూగుల్‌కు రూ.4,415 కోట్ల మేర జరిమానా వడ్డించింది. గూగుల్ తమ న్యూస్ కంటెంట్‌ను వాడుకుంటూ వాణిజ్య ప్రకటనల రూపంలో భారీగా ఆదాయం పొందుతోందని వార్తా సంస్థలు ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నాయి. కాగా, తాజా పరిణామంపై గూగుల్ నుంచి ఇంకా స్పందన రాలేదు.