ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జులై 2023 (12:44 IST)

పిల్లలు ఎత్తు పెరగడం ఆగిపోతే ఏం చేయాలి?

సాధారణంగా కొంతమంది పిల్లలు కొంతకాలం తర్వాత ఎత్తు పెరగడం ఆగిపోతుంది. దీనికి కారణం గ్రోత్ హార్మోన్‌లో వృద్ధి లేకపోవడమే. ఎముకల పెరుగుదలకు ఈ హార్మోన్ ఎంతగానో తోడ్పడుతుంది. 17 నుంచి 18 ఏళ్ల వరకూ కూడా పిల్లలు పెరుగుతూనే ఉంటారు. ఆ తర్వాత శరీరంలోని ఎముకలన్నీ ఫ్యూజ్ అయిపోతాయి. కాబట్టి పెరుగుదల అక్కడితో ఆగిపోతుంది. అందువల్ల  10 నుంచి 12 వయసు పిల్లలను పీడియాట్రీషియన్ దగ్గరకు తీసుకువెళ్తూ ఎత్తును పరీక్షిస్తూ ఉండాలి. 
 
వైద్యులు మాత్రమే పిల్లల వయసు, ఎత్తు, బరువులూ సమంగా మ్యాచ్ అవుతున్నదీ, లేనిదీ చెప్పగలుగుతారు. వయసుకు తగ్గ ఎత్తు లేనప్పుడు, అందుకు తగ్గట్టు గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి జరుగుతుందో లేదో రక్త పరీక్షలతో, బ్రెయిన్ స్కాన్‌తో వైద్యులు తెలుసుకుంటారు. సమస్య ఉందని తేలినప్పుడు గ్రోత్ హార్మోన్ ఇంజక్షన్లను వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవలసి ఉంటుంది. బ్రెయిన్ స్కాన్‌తో పెరుగుదలకు తోడ్పడే పిట్యుటరీ గ్రంథిలో సమస్య ఉందా, లేక గ్రోత్ హార్మోన్ సమస్య ఉందా అనే విషయం స్పష్టమైపోతుంది. 
 
కొంతమంది పిల్లలకు పిట్యుటరీ గ్రంథిలో వాపు, ఎడినోమాలు (అసహజ పెరుగుదలలు) ఉంటాయి. ఇలాంటి సమస్యలను సర్జరీలతో సరిచేయవచ్చు. గ్రంథిలో ఎలాంటి సమస్యా లేకుండా గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి తగ్గినట్టు తేలితే, ఇంజెక్షన్లతో సమస్యను సరిదిద్దవచ్చు. అయితే పిల్లలు వయసుకు తగినంత ఎత్తు పెరుగుతున్నారో లేదో తెలుసుకోవడం కోసం తల్లితండ్రులు 10 నుంచి 12 ఏళ్ల వయసుకు చేరుకునే వరకూ పిల్లలను ప్రతి ఆరునెలలకోసారి పీడియాట్రిషియన్ చేత పరీక్షలు చేయిస్తూ ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.