సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (12:05 IST)

కరీంగంజ్ జిల్లాలో ఘోరం : ఆటో - లారీ ఢీ - 10 మంది మృతి

అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంగంజ్‌ జిల్లాలోని బైతఖల్‌ వద్ద ఆటోను ఓ సిమెంట్‌ బస్తాల లోడుతో వెళుతున్న లారీ ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్నవారిలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. 
 
గురువారం ఉదయం 7.30 గంటలకు అసోం-త్రిపుర జాతీయ రహదారి 8పై బైతఖల్‌ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో మరణించారు. 
 
ఆటోలో ఉన్నవారంతా ఛాట్‌ పూజ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో మహిళలు, యువతులు, చిన్నపిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 
 
ప్రమాద ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రక్‌ డ్రైవర్‌ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.