కేరళలో ఘోర ప్రమాదం- ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు మృతి
కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ విద్యార్థులు వెళ్తున్న కారు అదుపుతప్పి బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
సోమవారం రాత్రి అలప్పుజ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వందనం మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు సోమవారం రాత్రి గురువాయుర్ నుంచి కాయంకులం బయలుదేరారు. మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది.
ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుగా మారింది. ముగ్గురు స్టూడెంట్లు అక్కడికక్కడే చనిపోయారు.
బస్సు ప్రయాణికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు.