శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (14:00 IST)

ఢిల్లీలో ప్లాంట్ లేకపోతే ఆక్సిజన్ అందదా? ప్రధాని మోడికి కేజ్రీవాల్ సూటి ప్రశ్న!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూటిగా ఓ ప్రశ్న సంధించారు. ఢిల్లీ గడ్డపై ప్లాంట్ లేకపోతే.. రాష్ట్రానికి ఆక్సిజన్ అందదా సార్ అంటూ నిలదీశారు. పైగా, ఢిల్లీ రాష్ట్రానికి వచ్చే ఆక్సిజన్ ట్యాంకర్ లారీ ఆగిపోతే తాను ఎవరికి ఫోన్ చేయాలో చెప్పండంటూ ప్రశ్నించారు. ప్రధాని మోడీని ఉద్దేశించిన కేజ్రీవాల్ అడిగిన ప్రశ్నలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ప్రధాని 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ ఢిల్లీలోని హాస్పిటళ్లలో ఆక్సిజన్‌ సంక్షోభాన్ని ఎత్తి చూపారు.
 
'సార్‌.. మాకు మీ మార్గదర్శకత్వం అవసరం. ఢిల్లీలో భారీగా ఆక్సిజన్‌ కొరత ఉంది. ఇక్కడ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ లేకపోతే ప్రజలకు ఆక్సిజన్‌ లభించదా? దయచేసి ఢిల్లీకి ఉద్దేశించిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ మరొక రాష్ట్రంలో ఆగిపోయినప్పుడు నేను ఎవరితో మాట్లాడాలో సూచించండి' అని కోరారు. 
 
‘సర్, దయచేసి ట్రక్కులు (ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్లు) ఆగిపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేయండి.. తద్వారా ఆక్సిజన్ ఢిల్లీకి చేరుకుంటుంది’ అని పేర్కొన్నారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి జాతీయ విధానానికి ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 
 
అలాగే కొరతను తీర్చేందుకు పశ్చిమ బెంగాల్‌, ఒడిశా నుంచి వాయుమార్గంలో తరలించేందుకు వీలు కల్పించాలని కోరారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు జాతీయ విధానాన్ని తీసుకురావాలని సూచించారు..