శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (13:48 IST)

#BabriMasjidDemolitionCase తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా: ఎల్కే.అద్వానీ

బాబ్రీ విధ్వంసం కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తుది తీర్పుపై బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీ స్పందించారు. ఈ తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, ఈ కేసులోని అద్వానీతో సహా 32 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. 
 
ఈ తీర్పుపై ఎల్కే. అద్వానీ స్పందించారు. బాబ్రీ మ‌సీదు కేసులో సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మ‌న‌స్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్నాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ తీర్పు రామ‌జ‌న్మభూమి ఉద్య‌మం ప‌ట్ల త‌న నిబ‌ద్ద‌త‌తో పాటు బీజేపీ చిత్త‌శుద్ధిని తెలియ‌జేస్తుంద‌ని అద్వానీ పేర్కొన్నారు. 
 
ఈ కేసులో అద్వానీ నిర్దోషిగా ప్ర‌క‌టించ‌బ‌డ‌టంతో ఆయ‌న నివాసానికి ప‌లువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయ‌కులు వెళ్లారు. ఇక ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పోలీసులు భారీగా మోహ‌రించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.
 
న్యాయం గెలిచింది : ఎంఎం జోషి 
బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తుది తీర్పును ఇచ్చింది. ఈ కేసులోని నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. మసీదును కూల్చివేసిన వారు సంఘవిద్రోహులని పేర్కొంది. పైగా, నిందితులకు వ్యతిరేకంగా సీబీఐ సరైన సాక్ష్యాధారాలను సమర్పించలేక పోయిందని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. 
 
ఈ తీర్పుపై నిందితుల్లో ఒకరైన బీజేపీ సీనియ‌ర్ నేత ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి స్పందించారు. కోర్టు చ‌రిత్రాత్మ‌క తీర్పును ఇచ్చిన‌ట్లు చెప్పారు.  అయోధ్య‌లో 1992 డిసెంబ‌ర్ 6వ తేదీన ఎటువంటి కుట్ర జ‌ర‌గ‌లేద‌ని ఈ తీర్పుతో నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. తాము నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాలు, ర్యాలీల్లో ఎటువంటి కుట్ర లేద‌న్నారు. 
 
కోర్టు తీర్పు సంతోషాన్నిచ్చింద‌ని, రామ మందిర నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న‌ట్లు జోషి తెలిపారు. త‌మ‌కు ఫేవ‌ర్‌గా ఉన్న అంశాల‌ను కోర్టు ప‌రిశీలించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. కేవ‌లం రామ మందిర నిర్మాణం కోసమే త‌మ ఉద్య‌మం సాగిన‌ట్లు జోషి తెలిపారు. జ‌య్ జ‌య్ శ్రీరామ్ అంటూ ఆయ‌న నినాదం చేశారు. 
 
తీర్పు ముందే ఊహించినది: రాజ్‌నాథ్ 
అలాగే, కేంద్ర రక్షణ శాఖ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ, ఈ తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఎట్ట‌కేల‌కు న్యాయం గెలిచింద‌న్నారు. ఈ తీర్పు ముందు ఊహించిన‌దేన‌ని, అయితే, తీర్పు కోసం సుదీర్ఘ కాలం ఎదురు చూడాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
 
దాదాపు 28 ఏండ్లుగా విచార‌ణ జ‌రిగిన బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో సీబీఐ స్పెష‌ల్ కోర్టు బుధ‌వారం తీర్పు వెలువ‌రించింది. నిందితులు ఉద్దేశ‌పూర్వ‌కంగా మ‌సీదు కూల్చివేత‌కు పాల్ప‌డిన‌ట్లు రుజువులు లేనందున వారంద‌రినీ నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ తీర్పు చెప్పింది.