శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 14 జనవరి 2021 (21:51 IST)

కర్ణాటక బిజెపిలో క్యాబినెట్‌ చిచ్చు?

కర్ణాటకలోని అధికార బిజెపిలో 'కేబినేట్‌'చిచ్చు రగులుకుంది. కేబినెట్‌ విస్తరణలో లంచం, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డవారికే స్థానం కల్పించారంటూ స్వపక్షంలోని పలువురు నాయకులే గురువారం బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

నిబద్ధత, కులం, సీనియారిటీ, మత ప్రాతిపదికన కాకుండా అతని ప్రభుత్వాన్ని కూలదోయడానికి తయారు చేసిన సిడిని చూపించి మంత్రులవ్వడానికి కుట్ర పన్నిన వారికే పదవులు కట్టబెట్టారని బిజెపి సీనియ‌ర్ నేత బ‌స‌న‌గౌడ ఆర్‌. పాటిల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ కేబినెట్‌ విస్తరణ ప్రక్రియలో అవకాశాన్ని చేజార్చుకున్న వారిలో పాటిల్‌ కూడా ఒకరు. ఆయనతో పాటు హెచ్‌.విశ్వనాథ్‌, కుమారస్వామి, సతీష్‌రెడ్డి, శివనగౌడ నాయక్‌, తిప్పరెడ్డి, అలాగే ఎడ్యూరప్పకు అత్యంత సన్నిహితులు రేణుకాచార్యలు కూడా భంగపడ్డవారిలో ఉన్నారు.

బుధవారం జరిగిన కేబినేట్‌ విస్తరణలో ఎంటిబి నాగరాజు, ఉమేష్‌ కత్తి, అరవింద్‌ లింబావలి, మురుగేష్‌ నిరాని, ఆర్‌.శంకర్‌, సిపి యోగేశ్వర్‌, ఎస్‌.అంగారాలు చోటుదక్కించుకున్నారు. వీరిలో కత్తి ఉమేష్‌, అరవింద్‌ లింబ్‌వాలీ, మురుగేష్‌ నిరానిలు ఎడ్యూరప్పకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు.

మిగిలిన నలుగురిలో ఎమ్‌టిబి నాగరాజు, సిపి యోగేశ్వర్‌లు కాంగ్రెస్‌ నుండి వచ్చారు. అలాగే ఆర్‌.శంకర్‌ స్వతంత్ర అభ్యర్థి. గతేడాది కూలిన కాంగ్రెస్‌, జెడిఎస్‌ కూటమిలో మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. గత ఆదివారం ఆయన ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ అయిన తర్వాత కేబినెట్‌ను విస్తరించారు.

ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్‌ నేత డికె శివకుమార్‌ పదునైన వ్యాఖ్యలు చేశారు. ఈ బ్లాక్‌మెయిలింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. బిజెపి ఇప్పుడు బ్లాక్‌మెయిలర్స్‌ జనతా పార్టీ అయిందని, ఎడ్యూరప్ప క్యాబినెట్‌ విస్తరణలో లంచం, బ్లాక్‌మెయిల్‌ వంటి ఆరోపణలు స్వపక్షం నేతలు చేస్తుండడంతో వెంటనే హైకోర్టు, ఇడి వంటి సంస్థలతో విచారణ చేయించాలని, వెంటనే కేసు నమోదు చేయాలని ట్వీట్‌ చేశారు.

17 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కర్ణాటకలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి పడిపోయింది. అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎడ్యూరప్ప పదవి చేపట్టారు. ప్రస్తుతం క్యాబినెట్‌ విస్తరణలో తీవ్ర దుమారమే రేగుతోంది.