ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (15:28 IST)

భాగ్యనగర వాసుల గుండెలపై అమ్మోనియం నైట్రేట్ నిల్వలు??

ఇటీవల లెబనాన్ రాజధాని బీరూట్‌లోని పోర్టులో నిల్వవుంచిన అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఒక్కసారిగా పేలడంతో ఆ నగరం శ్మశానాన్ని తలపిస్తోంది. ఈ ప్రమాదంలో అనేక మంది మృతి చెందగా, వందల మంది అస్వస్థతకు లోనయ్యారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అమ్మోనియం నిల్వలు ఉన్న ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి భద్రతా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో పోర్టు నగరం చెన్నై సిటీలోని ఎన్నూరు హార్బరులోని మణలిలో 700 టన్నుల అమ్మోనియం నిల్వలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. 
 
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం తక్షణం వాటిని ఖాళీ చేయించాల్సిందిగా ఆదేశించింది. దీంతో మణలి వద్ద కంటైనర్లలో ఐదేళ్ల నుంచి నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలను హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నారు. ఆదివారం సాయంత్రం అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలున్న మూడు కంటైనర్లను మనలి నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ తరలిస్తున్నామని, మూడు రోజుల్లో పది కంటైనర్లను రవాణా పూర్తవుతుందని స్థానిక అధికారులు తెలిపారు.
 
ఐదేళ్ళ క్రితం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న అమ్మోనియం నైట్రేట్‌ను మణలిలో ఉన్న టెర్మినల్‌ వద్ద 37 కంటైనర్లలో నిల్వ ఉంచారు. ఇది మొత్తం 740 టన్నులని కస్టమ్స్‌ అధికారులు అప్పట్లో ధ్రువీకరించారు. అయితే, చెన్నైలో సంభవించిన వరదల్లో 50 టన్నుల మేర అమ్మోనియం నైట్రేట్‌ గాలిలో, నీటిలో కలిపోయిందని అధికారుల తెలిపారు. దీంతో ప్రస్తుతం 690టన్నులు ఉందని చెప్పారు. ఈ మొత్తానని హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో ఈ అమ్మోనియం నైట్రేట్ నిల్వలను హైదరబాద్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన భాగ్యనగర వాసులు భయంతో వణికిపోతున్నారు. అయితే, ఈ అంశంపై ప్రభుత్వ అధికారులు మాత్రం స్పందించడం లేదు.