గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (12:37 IST)

హెయిర్ కట్ చేయించుకోమన్న టీచర్... మనస్తాపంతో విద్యార్థి సూసైడ్!

బాగా పెరిగిపోయివున్న వెంట్రుకలను కత్తిరించుకోమని (హెయిర్ కట్) తన వద్ద చదువుకునే విద్యార్థికి ఓ ఉపాధ్యాయుడు సూచన చేశారు. దీంతో ఆ విద్యార్థి మనస్తాపం చెందిన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన చెన్నై అరుంబాక్కం, వినాయకపురంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వినాయకపురంకు చెందిన సంజయ్‌ కుమార్‌ (15) అనే విద్యార్థి మదురవాయల్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌ టూ చదువుతున్నాడు. మంగళవారం ఇంటి నుంచి ఉత్సాహంతో పాఠశాలకు వెళ్లాడు. 
 
మధ్యాహ్నం 12 గంటకు ఇంటికి వచ్చిన సంజయ్‌కుమార్‌ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని ఎంతసేపటికి బయటకు రాలేదు. అనుమానించిన తల్లిదండ్రులు తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లగా, అతను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం చూసి బోరున విలపించారు.
 
దీనిపై సమాచారం అందుకున్న చూలైమేడు పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో సంజయ్‌కుమార్‌ జుట్టు ఎత్తుగా పెంచుకోవడంతో దానిని కత్తిరించుకొని పాఠశాలకు రావాలని ఉపాధ్యాయుడు మందలించాడని, అందువల్ల మనస్తాపానికి గురైన సంజయ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.
 
మరోవైపు, సంజయ్‌కుమార్‌ సహచర విద్యార్థినిని ప్రేమిస్తున్నట్టు, అతని ప్రేమను ఆమె అంగీకరించకపోవడంతో అతను ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చని మరో కారణంగా పోలీసులు భావిస్తున్నారు.