గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (09:57 IST)

మైనర్ అక్కాచెల్లెళ్ళపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

దేశంలో మైనర్ బాలికలకు  కూడా రక్షణ లేకుండా పోతోంది. ఫలితంగా దేశంలో ఎక్కడో చోట వారు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. తాజాగా మైనర్ అక్కా చెల్లెళ్లపై ఎనిమిది మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బలోదాబజార్‌ ప్రాంతంలో ఇద్దరు మైనర్ బాలికలు నివశిస్తున్నారు. వారిద్దరిలో అక్క వయసు 16 సంవత్సరాలు కాగా.. చెల్లెలి వయసు 14 యేళ్ళు. మార్చి 31వ తేదీన వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి ఇంటికి వస్తున్నారు.
 
ఇంతలో అకస్మాత్తుగా దాదాపు 8 మంది యువకులు వారిపై దాడి చేసి మిగతావారందరినీ బెదిరించి తరిమేశారు. అక్కచెల్లెళ్లిద్దరినీ ఎత్తుకెళ్లి వారిపై అత్యాచారం చేశారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టారు. దీంతో వారిద్దరూ నోరు మెదపలేదు. 
 
అయితే రెండు రోజుల క్రితం ఇద్దరిలో ఓ బాధితురాలు మహిళా, శిశు అభ్యున్నతి శాఖను ఆశ్రయించింది. తనపై రెండు నెలల క్రితం కొందరు అత్యాచారం చేశారని, తనతో పాటు తన సోదరిపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారని వాపోయింది. 
 
ప్రస్తుతం వారిలో ఒకరు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని, అత్యాచారం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని వాపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం మొత్తం 11 మందిని అదుపులోనికి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉండటం గమనార్హం. వీరందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.