ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (19:29 IST)

"జాగ్రత్త నరేంద్రమోదీ.. దేశం నుంచి నిన్ను తరిమేస్తాం.. సీఎం కేసీఆర్

జనగామ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఘాటు పదాలతో ఏం చేసుకుంటావో చేసుకో అంటూ చెలరేగిపోయారు. "దేశం నుంచి నిన్ను తరిమేస్తాం.. మాకివ్వాల్సినవి ఇవ్వకుండా ఇచ్చేవాడిని తెచ్చుకుంటాం.. ఖబడ్దార్ మోదీ" అని నినదించారు. "జాగ్రత్త నరేంద్రమోదీ… ఇక్కడ తెలంగాణ పులిబిడ్డ.. మీ ఉడత ఊపులకు పిట్ట బెదిరింపులకు భయపడేవాడు ఎవడూ లేడు" అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. 
 
"సిద్దిపేట ప్రజలు పంపిస్తే తెలంగాణ సాధించామని.. మీరందరూ పంపిస్తే ఢిల్లీ కోటను బద్దలు కొడతామని" తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. అవసరమైతే ఢిల్లీ దాకా వస్తామని.. మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు.  
 
తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు.. ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వరు.. మనం పండించిన పంట కూడా కొనరు.. కానీ విద్యుత్ సంస్కరణల పేరుతో మీటర్లు పెట్టాలంటున్నారని కేసీఆర్ అన్నారు. తనను చంపినా మీటర్లు పెట్టేందుకు ఒప్పుకునేది లేదన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.