1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 మే 2023 (10:57 IST)

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి : కొలీజియం సిఫార్సు

supreme court
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిసీ పీకే మిశ్రాతో పాటు మరో సీనియర్ న్యాయవాది విశ్వనాథన్‌ల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిద్దరికీ సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని కేంద్రానికి కొలీజియం సూచన చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తాజాగా చేసిన రెండు ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరుతుంది. 
 
రెండు రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ ఎమ్మార్ షా, దినేష్ మహేశ్వరిలు పదవీ విరమణ చేశారు. వారి స్థానాల్లో కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులను నియమించాల్సిందిగా కొలీజియం సిఫార్సు చేసింది. ఈ కొలీజియంలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎస్ జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు సభ్యులుగా ఉన్నారు. 
 
కాగా, కొలీజియం సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపి విశ్వనాథన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే, సీనియారిటీ ప్రకారం ఆయన 2023లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన సుప్రీంకోర్టు సీజే పదవిలో 2031 మే 25వ తేదీ వరకు కొనసాగుతారు. రోస్టర్ ప్రకారం జస్టిస్ జేబీ పార్థీవాలా 2028లో సీజేఐ బాధ్యతలను చేపట్టనున్నారు. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత విశ్వనాథన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందుతారు.