బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2019 (08:18 IST)

శరద్‌పవార్‌పై ఈడీ కేసు

మహారాష్ట్రలో అక్టోబర్‌ 21వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం సంభవించింది. నేషలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్, మాజీ సీఎం శరద్‌ పవార్, ఆయన అన్నకొడుకు అజిత్‌ పవార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసులు నమోదు చేసింది.

మహారాష్ట్ర రాష్ట్ర కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఎంఎస్‌సీబీ)లో రూ.25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి వీరిపై మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రైతులకు రుణాల మంజూరులో ఎంఎస్‌సీబీలో ఆడిట్‌ చేపట్టిన నాబార్డు రైతులకు రుణాల మంజూరులో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.

ఫలితంగా ఖాయిలా పడిన చక్కెర కర్మాగారాలను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు గుర్తించింది. ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు తేల్చింది. నిర్దిష్టమైన ఆధారాలున్నందున దీనిపై కేసు నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు ఆగస్టులో ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ)ని ఆదేశించింది. ఈవోడబ్ల్యూ ఈ మేరకు ముంబై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కుంభకోణంలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

వీటి ఆధారంగా మంగళవారం ఈడీ అప్పటి సీఎం శరద్‌పవార్‌ సహా 2007–17 సంవత్సరాల మధ్య పనిచేసిన ఎంఎస్‌సీబీ డైరెక్టర్లు, మాజీ డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌తో పాటు 70 మంది మాజీ అధికారులపై కేసులు పెట్టింది. 

వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ఎన్‌సీపీ– కాంగ్రెస్‌ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఈ పరిణామం సంభవించడం గమనార్హం.