1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (20:31 IST)

చైనాకు వార్నింగ్ ఇచ్చిన ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌.. పాకిస్థాన్ కూడా ఆ పని?

Gen Naravane
భారత్-చైనా సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన జవాన్ల మధ్య ఘర్షణ, ఇద్దరు భారత జవాన్లు అమరులైనారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, ఎప్పటికప్పుడూ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు, సరిహద్దుల్లో ఆక్రమణలు, అక్రమంగా కట్టడాల నిర్మాణానికి ఎప్పటికప్పుడూ చైనా ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో డ్రాగన్‌ కంట్రీ చైనాకు పరోక్షంగా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణె. దేశాల సరిహద్దుల వద్ద యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నాన్ని కూడా భారత సైన్యం సఫలం కానివ్వబోదని ప్రకటించారు.
 
చైనా సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గత ఏడాది భారత సైన్యం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందన్నారు.. తూర్పు లఢాఖ్‌లో పరిస్థితులను నియంత్రణలో ఉంచేందుకు ఇటీవల సైనిక అధికారుల స్థాయి 14వ విడత చర్చలు కూడా జరిగాయన్నారు. 
 
సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహించేందుకు పాకిస్థాన్‌ ఇంకా ప్రయత్నాలు సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఎం నరవణె. బోర్డర్‌ దగ్గర కశ్మీర్​లోకి చొరబడేందుకు 300-400 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.