మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జులై 2022 (09:57 IST)

భారీ వర్షాలు.. అమర్‌నాథ్ క్షేత్రం వద్ద వరదలు: 15 మంది మృతి (video)

amarnath yatra
జమ్ముకాశ్మీర్‌లో దక్షిణ హిమాలయాల్లోని ప్రసిద్ధ అమరనాథ్‌ క్షేత్రం వద్ద వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో మట్టి చరియలు మీదపడి 15 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ఆచూకీ లేకుండా పోయారు. తాత్కాలిక ఆవాసాలు కొట్టుకుపోయాయి.
 
అమర్‌నాథ్‌ క్షేత్ర సమీపంలో గురువారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అమర్‌నాథ్ గుహకుపై భాగంలోనూ, ఇరువైపులా వరద ముప్పేట ధాటితో కళ్లెదుటే తమ సహచర యాత్రికులు తాత్కాలిక ఆవాసాలతో సహా కొట్టుకుపోయారనివారు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇప్పటి వరకు పది మంది మృతదేహాలను వెలికితీశామని, నలుగురిని రక్షించామని ఆ అధికారి పేర్కొన్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, బిఎస్‌ఎఫ్‌, ఐటిబిపి, జమ్ముకాశ్మీర్‌ పోలీసు బలగాలు స్థానిక ప్రజలతో కలిసి సహాయక చర్యలను ముమ్మరంగా సాగిస్తున్నామని, రాత్రి వేళలోనూ సహాయక చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.
 
ఆకస్మిక వరదల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయినవారికి సంతాపం ప్రకటించారు. కేంద్ర హోమంత్రి అమిత్‌ షా జమ్ముకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నరు మనోజ్‌ సిన్హాతో వరద పరిస్థితిపై సమీక్షించారు.
 
భారీ వర్షాల నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు మంగళవారం నాడే ప్రకటించారు.
 
ఈ ఏడాది జూన్‌ 30న ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటి వరకు లక్ష మంది పైగా యాత్రికులు అమర్‌నాథ్‌ను దర్శించుకొని వెళ్లారు. రక్షాబంధన్‌ సందర్భంగా ఆగస్టు 11న ఈ యాత్ర ముగుస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు.