ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

14 -16 తేదీల మధ్యలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి!!

election evm
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. భారత ఎన్నికల సంఘం నేడు రేపే ఈ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. ముఖ్యంగా, ఈ నెల 14 లేదా 16వ తేదీల మధ్య ఈ నోటిఫికేషన్ వెలువడవచ్చని ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొంటున్నాయి. అదేసమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనుంది. అక్కడ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించగలమనేది మూడు రోజుల పర్యటనలో అంచనా వేయనుంది. 
 
తర్వాత ఒకటి రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించవచ్చని తెలిసింది. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఈ యేడాది సెప్టెంబరు లోపు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే అక్కడ అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించగలిగే అవకాశం ఉందేమో అంచనా వేయాలని కేంద్ర ప్రభుత్వం ఈసీని కోరింది. మరోపక్క, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏప్రిల్ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే 'కోడ్' అమల్లోకి రానుంది. 
 
ఈసీ కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా... కమిషనర్ల నియామకం ఎలా జరుగతుంది? 
 
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ శనివారం రాజీనామా చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజీనామాపై ఆమోదముద్ర వేస్తూ గెజిట్‌ను విడుదల చేసింది. ఆయన పదవీకాలం మరో మూడేళ్ళు ఉండగా, అదీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొన్ని రోజుల ముందు రాజీనామా చేయడం ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనం గా మారింది. ఇప్పటికే ఓ ఖాళీ ఉండగా, తాజా రాజీనామాతో ఈ ఖాళీల సంఖ్య రెండుకు చేరింది. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ఇదిలావుంటే, సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కమిషనర్ల నియామకం ఎలా జరుగుతుందన్న చర్చ ఇపుడు ప్రారంభమైంది. 
 
భారత రాజ్యాంగంలోని 324 నుంచి 329 అధికరణలు ఎన్నికల సంఘం సభ్యుల నియామకం, జీతభత్యాలు, కాలపరిమితి, విధులను తెలియజేస్తున్నాయి. ఆర్టికల్ 324(2) అధికరణలో సభ్యుల నియామకాన్ని రాష్ట్రపతి చేపడతారని పేర్కొంటూనే... పార్లమెంటు ఏదైనా చట్టాన్ని చేస్తే... దాని ప్రకారం నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. అయితే... రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత ఏడాది వరకు కేంద్ర ప్రభుత్వం విచక్షణ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకాలు జరిగేవి. 
 
సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం గతేడాది 'ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ యాక్ట్-2023' చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం.. తొలుత కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు కేంద్ర కార్యదర్శులతో సెర్చ్ కమిటీని ఏర్పాటుచేయాలి. ఈ కమిటీ ఐదుగురి పేర్లను సెలెక్షన్ కమిటీకి పంపాలి. నెలక్షన్ కమిటీకి ప్రధాని చైర్మన్ ఉంటారు. లోక్‌సభలో విపక్ష నేత, ప్రధాని సూచించే కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. సెలెక్షన్ కమిటీకి కొన్ని విచక్షణాధికారాలుంటాయి. సెర్చ్ కమిటీ పరిగణనలోకి తీసుకుని పేర్లను సైతం అవసరమనుకుంటే నెలెక్షన్ కమిటీ పరిశీలించవచ్చు. సెలెక్షన్ కమిటీ పంపే పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. సీఈసీ, కమిషనర్లు ఆరేళ్లపాటు లేదా 65 ఏళ్ల వరకూ పదవిలో ఉంటారు.