సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (13:26 IST)

42 ఏళ్లుగా విజయమెరుగని విక్రమార్కుడు!

ఎన్నికల నగారా మోగిందంటే... ఓటర్లు తమ ఓట్లను తనిఖీ చేసుకుంటుంటే... టిక్కెట్‌ల కోసం ఎదురుచూసే ఆశావహులు తమ పార్టీలలో ప్రయత్నించడం... కుదరకపోతే పార్టీ మారిపోవడం చూస్తూనే ఉంటాము. కానీ గత 42 ఏళ్లుగా లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోతూనే ఉన్నా ఈసారి కూడా ఓడిపోతానని చెప్తూ కూడా పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థి గురించి మీకు తెలుసా...
 
వివరాలలోకి వెళ్తే... ఎన్నికల్లో పోటీ చేయడం అంటే అతనికి ఎంత ఇష్టం అంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్నప్పటికీ... గత 42 ఏళ్లుగా పోటీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి 16 సార్లు ఘోరంగా పరాజయం పాలైనా మరోసారి కూడా లోక్‌సభ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. 
 
విశేషమేమిటంటే ఈసారి కూడా తాను ఓడిపోతానని ఆయనే చెబుతుండటం. ఆయన పేరు ఫక్కడ్‌ బాబా (75). ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతూంటారు. ఆయన 1977 ఎన్నికల్లో మధుర లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి  పోటీ చేసారు. 
 
అనంతరం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నోసార్లు బరిలోకి దిగారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ, 2017 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తలపడ్డారు. తాజాగా 17వ సారి మధుర నుంచి మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. 
 
తాను 20వ సారి ఎన్నికల బరిలోకి దిగినప్పుడు తప్పక గెలుస్తానని తన గురువు నిశ్చలానంద స్వామి ఆశీర్వదించారని సదరు ఫక్కడ్ బాబాగారు చెప్తున్నారు. గో సంరక్షణే తన లక్ష్యమని, పేదల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉందనీ పేర్కొంటున్న ఆయన ఎప్పటికి గెలుస్తారో చూద్దాం మరి.