మదురై శైవ మఠాధిపతి అరుణగిరినాధర్ కన్నుమూత
మదురైలో ప్రసిద్ధి చెందిన శైవ మఠం ఆధీనం(మఠాధిపతి) అరుణగిరినాధర్ (77) శుక్రవారం కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కొద్దిరోజుల క్రితం ఆయనను మదురైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆధీనం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 1,500 సంవత్సరాల చరిత్ర ఉన్న శైవ మఠానికి ఆయన 292వ పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు.
అరుణగిరినాధర్ మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామిలు సంతాపం వ్యక్తం చేశారు. శైవ మత సూత్రాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు సీనియర్ పాత్రికేయులుగా పనిచేస్తూ ప్రజోపకరమైన పనులలో ఆయన నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన మరణం తీరని లోటు అని చెప్పారు. తమిళ ప్రపంచానికి ఆయన మరణం పెద్ద లోటు అంటూ ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.