1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (19:35 IST)

మహారాష్ట్రలో రైతు ఇంట్లో 400 కేజీల టమోటాలు చోరీ

tomatos
మహారాష్ట్రలోని పూణె‌లో ఓ రైతు ఇంట ఉంచిన టమోటాలు చోరీకి గురయ్యాయి. ఇంటిలో విక్రయానికి వచ్చిన టమోటాల్లో 400 కేజీలు చోరీకి గురయ్యారు. దీంతో స్థానిక పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర పూణెకు చెందిన ఓ రైతు తన పొలం నుంచి కోసుకొచ్చిన 400 కేజీల టమోటాలను రాత్రి ఇంటి బయట వాహనంలో ఉంచాడు. తెల్లారి చూసే సరికి ఆ సరకు మాయమైంది. దీంతో అతడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
 
శిరూర్‌ తహసిల్‌ పరిధిలోని పింపార్‌ఖేడ్‌కు చెందిన రైతు అరుణ్‌ ధోమే టమాటా సాగు చేశాడు. మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో 400 కేజీల దాకా కోసి ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు మార్కెట్‌కు తరలిద్దామనే ఉద్దేశంతో వాటిని 20 పెట్టెల్లో సర్ది ఇంటి బయటే వాహనంలో ఉంచాడు. తెల్లవారుజామునే ఆ వాహనం దగ్గరకు వెళ్లి చూడగా అరుణ్‌కు టమాటా పెట్టెలు కన్పించలేదు. 
 
చుట్టుపక్కల గాలించినా లాభం లేకపోయింది. తన పంటను ఎవరో దొంగిలించారని నిర్ధారించుకున్న రైతు వెంటనే శిరూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రైతు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. టమాటాల దొంగతనంపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.