గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (15:09 IST)

ప్రాణం కోసం వాకింగ్ స్టిక్‌తో చిరుతతో పోరాడిన మహిళ

క్రూర జంతువుల బారినపడినపుడు తల్లిదండ్రులు తమ ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా పోరాటం చేస్తారు. ఈ విషయంలో ఏమాత్రం రాజీపడరు. తాజాగా ఓ మహిళ ఒంటరిగా కూర్చొనివుండగా, ఓ చిరుత దాడిచేసేందుకు యత్నించింది. వాకింగ్ స్టిక్‌తో దానితో పోరాడింది. 
 
ముంబైలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముంబై ఆరే ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలోనే చిరుత రెండోసారి దాడిచేయడం గమనార్హం. 
 
ఆరే డెయిరీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల్లో తొలుత చిరుతపులి నడుచుకుంటూ రావడం.. ఓ నిమిషం తర్వాత ఓ మహిళ ఊతకర్ర పట్టుకుని మెల్లగా నడిచి వస్తోంది.
 
నిర్మలా దేవి సింగ్ (55) అనే మహిళ అక్కడే ఉన్న అరుగులా ఉన్న ఓ గోడపై కూర్చుని ఉండగా.. చిరుత ఆమెపై దూసుకొస్తోంది. దీనిని గమనించి ఆ మహిళ తన ఊతకర్ర సాయంతో చిరుతను ఎదుర్కొని పక్కకు తోసేసింది. 
 
ఈ క్రమంలో నిర్మలా దేవి సింగ్ గొడపై నుంచి కింద పడిపోయింది. అయినా సరే ఊత కర్రతో చిరుతను అదిలించడంతో ఆ అడవి జంతువు వెనక్కు తగ్గింది. ఇంతలో ఆమె సాయం కోసం భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకున్నారు. దీంతో చిరుత అక్కడ నుంచి పారిపోయింది.