గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (19:37 IST)

ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ - 99.18 శాతం ఓటింగ్

president bhavan
భారత రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సోమవారం 5 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం ముగిసే సమయానికి 99.18 శాతం పోలింగ్ నమోదైనట్టు చీఫ్ రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. 
 
మరోవైపు బ్యాలెట్‌ బాక్సులు అన్ని రాష్ట్రాల నుంచి సోమవారం రాత్రికే వాయు, రోడ్డు మార్గాల్లో పార్లమెంట్‌కు చేరుకోనున్నాయి. పార్లమెంట్‌లో ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం 736 మందికి (727మంది ఎంపీలు, 9మంది ఎమ్మెల్యేలు)కు అనుమతి ఇవ్వగా.. 730 మంది (721 మంది ఎంపీలు, 9మంది ఎమ్మెల్యేలు) ఓటు వేశారని వెల్లడించారు. 
 
ఈ ఎన్నికల్లో తొలుత ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌ పార్లమెంట్‌ భవనంలో హాలు నంబర్‌ 63లో ఏర్పాటు చేసిన ఆరు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
 
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వీల్‌ఛైర్‌లో వచ్చి తన సంరక్షకుల సాయంతో నిలబడి ఓటు వేశారు. పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తొలి ఓటు వేశారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ తొలి ఓటు వేయగా.. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఏపీ ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణలో మంత్రి కేటీఆర్‌ తొలి ఓటు వేశారు. ఎన్నిక ప్రశాంతంగా జరిగింది.
 
అలాగే, నాలుగు రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్‌ భవనంలో తమ ఓటు హక్కు వినియోగించుకోగా..  45మంది ఎంపీలు (వైకాపా ఎంపీ పరిమాల్‌ నత్వానీ గుజరాత్‌లో.. టీఎంసీ ఎంపీలంతా కోల్‌కతాలోని అసెంబ్లీ ప్రాంగణంలోనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు) పార్లమెంట్‌ భవనంలో కాకుండా బయట రాష్ట్రంలో ఓటు వేశారు. 
 
ఇంకోవైపు, బ్యాలెట్‌ బాక్సులన్నీ దిల్లీకి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. పార్లమెంట్‌ భవనంలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు వీటన్నింటినీ తరలిస్తారు. కొందరు ఎంపీలు బయటి రాష్ట్రాల్లో ఓటు వేయడం, కొందరు ఎమ్మెల్యేలు పార్లమెంట్‌ ఆవరణలో ఓటు వేయడంతో రాష్ట్రాల వారీగా బ్యాలెట్లను వేరు చేసి లెక్కింపు చేపట్టనున్నారు. 
 
ఈ నెల 21న ఉదయం 10.30గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల సమయంలోనే ఓట్ల లెక్కింపు పూర్తయి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఎంత శాతం ఓట్లు, ఎంత విలువైన ఓట్లు వచ్చాయనే విషయాన్ని ఈసీ ప్రకటించనుంది.