గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (13:13 IST)

మనీలాండరింగ్ కేసు... ప్రియాంకా గాంధీ పేరు ప్రస్తావన

priyanka gandhi
మనీలాండరింగ్ ఆరోపణలపై బ్రోకర్ సంజయ్ భండారీపై నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలిసారిగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరును ప్రస్తావించింది. అయితే ప్రియాంకను నిందితురాలిగా పేర్కొనలేదు. అదే ఛార్జిషీట్‌లో ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరు కూడా ఉంది.
 
లండన్‌లో తన అక్రమ సంపాదనతో భండారీ సంపాదించిన ‘12 బ్రయాన్‌స్టోన్ స్క్వేర్’ అనే ఇంటిని వాద్రా పునరుద్ధరించారని, అక్కడే నివాసం ఉంటున్నారని ఈడీ మంగళవారం ఆరోపించింది. 
 
ఈ విషయంలో బ్రిటన్ కు చెందిన సుమిత్ చద్దా అనే వ్యక్తి వాద్రాకు సహకరించాడని సమాచారం. సుమిత్, వాద్రా సన్నిహితులలో ఒకరైన చెరువత్తూర్ చాకుట్టి తంపిపై తాజా ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది.
 
అలాగే, ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ హర్యానాలో భూమిని పొందారని దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. 2006లో ఫరీదాబాద్‌లోని వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి, 2010లో అదే ఏజెంట్‌కు విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని ఈడీ తన అభియోగాలలో పేర్కొంది. 
 
ఆ లావాదేవీలు వాద్రా, థంపి మధ్య భాగస్వామ్య సంబంధాలు, పరస్పర వ్యాపార ప్రయోజనాలను వెల్లడిస్తాయని తన ఆరోపణలలో పేర్కొంది. ఈ కేసులో నిందితుడైన భండారీ 2016లో బ్రిటన్‌కు పారిపోయాడు. అతడిని వెనక్కి తీసుకురావాలని ఈడీ, సీబీఐ చేసిన అభ్యర్థనను ఈ ఏడాది జనవరిలో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించింది.