గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (13:42 IST)

కల్లోల బంగ్లాదేశ్... నిశితంగా గమనిస్తున్న భారత్.. అఖిలపక్ష భేటీ!

sheik hasina
పొరుగుదేశం బంగ్లాదేశ్‌ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో రిజర్వేషన్ల చిచ్చురేగింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆ దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి ఏకంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీయడమే కాకుండా, ఆమె ఏకంగా దేశం వదిలి పారిపోయిన పరాయి దేశంలో తలదాచుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. సోమవారం రాత్రి అత్యవసరంగా సమావేశమైన కేబినెట్ భద్రతా వ్యవహారల కమిటీ బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష చేసింది. అలాగే, మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించింది. 
 
మరోవైపు, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా... ఎవరికంటా కనిపించకుండా భారత్‌కు చేరుకున్నారు. ఆమె విమానం భారత్‌లోకి వస్తుందని తెలుసుకున్న భారత భద్రతా బలగాలు గగనతలంపై నిఘా వేశాయి. అటువైపు నుంచి వచ్చే విమానం భారత్‌లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి.
 
భారత వాయుసేన రాడార్లు బంగ్లాదేశ్ గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అటు నుంచి ఓ విమానం వస్తున్నట్లు మన భద్రతా బలగాలు గమనించాయి. దాంట్లో ఎవరు వస్తున్నారో ముందే పసిగట్టిన అధికారులు దాన్ని భారత్‌లోకి అనుమతించాలని ఆదేశించారు. పైగా ఈ విమానానికి రక్షణ కల్పించేందుకు పశ్చిమ బెంగాల్లోని హాసీమారా వైమానిక స్థావరం నుంచి 101 స్క్వాడ్రన్‌లోని రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. హసీనా ప్రయాణిస్తున్న విమానానికి బీహార్, ఝార్ఖండ్ మీదుగా అవి రక్షణ కల్పించాయి.
 
మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హిండన్ విమానాశ్రయంలో దిగే వరకు భద్రతా ఏజెన్సీలు హసీనా విమానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. అందులోని సిబ్బందితో భారత్ దళాలకు చెందిన ఉన్నతాధికారులే స్వయంగా సంప్రదింపులు జరిపారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలన్నింటినీ భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, పదాతిదళాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నిశితంగా పరిశీలించినట్లు సమాచారం. 
 
హసీనా విమానం హిండన్ ఎయిర్ బేస్‌లో సాయంత్రం 5:45 గంటలకు దిగింది. ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవాల్ ఆహ్వానించారు. అక్కడే దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు సహా భవిష్యత్ కార్యాచరణ గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అనంతరం అక్కడి నుంచి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి పరిస్థితిని ఆయన వివరించారు.