ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (11:53 IST)

పరువు నష్టం కేసు : రాహుల్ పిటిషన్‌పై 21న విచారణ

rahul gandhi
మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 21వ తేదీన విచారణ చేపట్టనుంది. ఈ కేసులో గుజరాత్ సెషన్స్‌ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్‌ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు ఇటీవల కొట్టేసింది. దీంతో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
 
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఈ పరువునష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. 
 
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటుపడుతుంది. దీంతో ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటువేస్తూ.. లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది.
 
దీంతో సెషన్స్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో రాహుల్‌ గాంధీకి కిందికోర్టు శిక్ష విధించడం సరైనదేనని హైకోర్టు తెలిపింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ రాహుల్‌ పిటిషన్‌ను కొట్టేసింది. ఇపుడు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సమ్మతం తెలిపింది.