13 ఏళ్ల బాలికను రూ.7లక్షలకు అమ్మేసిన కసాయి తండ్రి.. 4 నెలల గర్భంతో?
కన్నబిడ్డనే ఓ కసాయి తండ్రి అమ్మేశాడు. 13 ఏళ్ల బాలికను డబ్బుల కోసం ఓ తండ్రి అమ్మేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ఓ తండ్రి 13 ఏళ్ల కుమార్తెను ఏడు లక్షల రూపాయలకు అమ్మేశాడు. కానీ ఆ చిన్నారిని హైదరాబాదులో పోలీసులు కనుగొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కిడ్నాప్ కేసును నమోదు చేశారు.
బాలిక కనిపించడం లేదని ఈ ఏడాది జూన్‌లో తల్లి నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ చేయగా తండ్రే దోషి అని తేలడంతో ఆయనకు సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇక బాలిక ఎక్కడుందో కనుగొనే ప్రయత్నం చేసిన పోలీసులు చివరకు గెలిచారు. అలాగే బాలిక హైదరాబాదులో ఉన్నట్లు కనుగొన్నామని పోలీసులు చెప్పారు.
చిన్నారిని బామర్‌కు తీసుకువచ్చినట్లు చెప్పిన జిల్లా ఎస్పీ శరద్ చౌదరీ ప్రస్తుతం తల్లికి అప్పగించినట్లు వెల్లడించారు. ఇక చిన్నారిని నవంబర్ 15న రాజస్థాన్ హైకోర్టులో ప్రవేశపెడతామని వెల్లడించారు. అయితే ఆ చిన్నారిని ఎవరో గర్భవతిని చేశారని.. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భంతో వుందని పోలీసులు చెప్పారు.