గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (09:28 IST)

ఓటీటీలకు త్వరలో మార్గదర్శకాలు ఖరారు : ప్రకాష్ జావదేకర్

ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తోంది. అనేక కొత్త చిత్రాలు ఓటీటీలోనే విడుదలవుతూ, కోట్లాది రూపాయల మేరకు వ్యాపారం చేస్తున్నాయి. అదేసమయంలో అసభ్యకరమైన రీతిలో వెబ్‌సిరీస్‌లు కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. వీటిపై అనేక రకాలైన ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. 
 
ఈ వ్యవహారంపై కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీలకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు తీసుకురానున్నట్టు చెప్పారు. ఓటీటీల్లో వస్తున్న కొన్ని సీరియళ్లపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. 
 
దీనికి కారణం ప్రెస్‌ కౌన్సిల్‌, కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ (నియంత్రణ) చట్టం, సెన్సార్‌ బోర్డు వంటి వాటి పరిధిలో ఓటీటీలు లేకపోవడమేనని చెప్పారు. అందుకే త్వరలోనే ఓటీటీ వేదికలకు సంబంధించిన మార్గదర్శకాలు తీసుకొస్తామని చెప్పారు. 
 
అశ్లీలత, హింస, మతపరమైన అంశాల విషయంలో గత కొన్నాళ్లుగా ఓటీటీల్లో వస్తున్న వెబ్‌ సిరీస్‌లపై ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హిందూ దేవుళ్లను అవమానించేలా ఉందంటూ ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌పై ఫిర్యాదులు వచ్చిన వేళ కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.