మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 6 జులై 2020 (19:16 IST)

చిన్నమ్మకు బిజెపి ఆశీస్సులు, రజినీకి మొండి చేయి, ఏమైందంటే?

శశికళ జైలుకు వెళ్లిన తరువాత తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. జయలలిత మరణం తరువాత తమిళనాడు రాజకీయాలు మారిపోవడం.. ఆ తరువాత శశికళ పగ్గాలు చేపడుతుందని అందరూ భావించారు.
 
అయితే అవినీతి కుంభకోణంలో శశికళ జైలుకు వెళ్ళిన పరిస్థితుల్లో అన్నాడిఎంకే నుంచి పళణిస్వామి పగ్గాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా తెలిసిందే. అయితే ఆగష్టు 14వ తేదీ శశికళ జైలు నుంచి విడుదల అవుతుందన్న ప్రచారం బాగానే జరుగుతోంది.
 
ఈ విషయాన్ని తమిళనాడుకు చెందిన బిజెపి నేత ఆశీర్వాదం ఆచారి స్వయంగా తెలిపారు. శశికళ ముందుగానే విడుదల కావడానికి బిజెపి నేతల ఆశీస్సులు కూడా కారణమన్న ప్రచారం ఊపందుకుంది. తమిళనాడులో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శశికళతో బిజెపి అగ్రనేతలు సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. బిజెపి ప్రతిపాదనలకు శశికళ కూడా సై అన్నారట. దీంతో శశికళ మార్గం సుగుమమైందట. 
 
గత ఉప ఎన్నికల్లో ఆర్.కే.నగర్ నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. ఎన్నికల్లో ప్రజలను ఎలా తమవైపు తిప్పుకోవాలో శశికళ అండ్ కో బ్యాచ్‌కు బాగా తెలుసునని.. కాబట్టి శశికళతో కలిస్తే తమిళనాడులో బిజెపి పాగా వేసినట్లేనని అధినేతలు అనుకుంటున్నారట. 
 
సరిగ్గా ఎన్నికల సమయంలో బిజెపిలో చేరి ఎన్నికల్లోకి వెళదామని నిర్ణయించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇది పెద్ద షాకే. రజినీకాంత్‌ను కాదని శశికళతో బిజెపి నాయకులు సంప్రదింపులు జరపడం.. అది కాస్త విజయవంతం కావడంతో అన్నాడిఎంకేలోని ఒక వర్గంలో సంతోషం వ్యక్తమవుతోందట. మరి ఆగష్టు 14వ తేదీన చిన్నమ్మ శశికళ విడుదల అయితే రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరగబోతోందో అన్నది ఆసక్తికరంగా మారుతోంది.