శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (12:58 IST)

హీరోయిన్‌ తలకు తుపాకీ గురిపెట్టి... పెళ్లి చేసుకోవాలని బెదిరింపు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ హీరోయిన్ తలకు తుపాకీ గురిపెట్టి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. షూటింగ్ కోసం వచ్చిన భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్‌ను హోటల్ గదిలోనే బంధించి కణతకు తుపాకీ గురిపెట్టి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడకు రావడంతో తుపాకీని పేల్చారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయం కాగా, ఓ సీనియర్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తృటిలో ప్రాణాలు తప్పించుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, హీరోయిన్ రీతూ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తూనే.. భోజ్‌పురి చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా రితీశ్ ఠాకూర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం వారణాసి రోబర్డ్స్ గంజ్‌లో ఉన్న ఓ నక్షత్ర హోటల్‌కు వచ్చి బస చేసింది. 
 
రీతూ సింగ్ అంటే పడిచచ్చే పంకజ్ యాదవ్ (25)... తన అభిమాన నటి రీతూ సింగ్ హోటల్‌లో ఉందని తెలుసుకున్నాడు. అంతే.. ఓ తుపాకీతో ఉదయం 11 గంటల ప్రాంతంలో హీరోయిన్ ఉన్న గదికి వెళ్లి.. తనను పెళ్లి చేసుకోవాలని తలకు తుపాకి గురిపెట్టాడు. దీంతో హీరోయిన్ భయభ్రాంతులకు గురైంది. ఈ విషయాన్ని గమనించిన అశోక్ అనే సిబ్బంది పోలీసులకు సమాచారం చేరవేశాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకోగానే వారిపై కాల్పులకు తెగబడ్డాడు. 
 
అయినప్పటికీ పోలీసులు ఎదురు కాల్పులు జరపకుండా లొంగిపోవాల్సిందిగా కోరారు. అప్పటికీ వినని పంకజ్ రీతూ వైపు తూపాకీ గురిపెట్టి కాల్చిపారేస్తామంటూ బెదిరించాడు. ఇలా గంటన్నర పాటు హైడ్రామా జరిగింది ఆ తర్వాత పోలీసులు నెమ్మదిగా పంకజ్‌ను మాటల్లోకి దించి... తుపాకీని లాక్కొనే ప్రయత్నం చేయడంతో పంకజ్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పులో ఓ వ్యక్తి గాయపడగా, పోలీసు ఉన్నతాధికారి ఒకరు గాయపడ్డారు. చివరకు నిందితుడు పంకజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత నిందితుడుని ఈడ్చుకెళ్ళి జీపులో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.