బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (12:08 IST)

వీర విధేయతతో అశోక్ గెహ్లాట్‌ సీఎం కుర్చీకి ఎసరుపెట్టిన అనచరులు?

sachin pilot - ashok gehlat
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి పదవి ఊడిపోయేలా ఉంది. ఆ రాష్ట్ర కొత్త సీఎంను పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒకటి రెండు రోజుల్లో ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో అశోక్ గెహ్లాట్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది.

దీనికి కారణం ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పోటీలో అశోక్ గెహ్లాట్ బలంగా నిలించారు. తదుపరి పార్టీ అధ్యక్షుడు ఈయనంటూ ప్రచారం జరిగింది.

అయితే ఇపుడు ఆ పోటీ నుంచి ఆయన అనూహ్యంగా తప్పుకున్నారు. తాను సీఎం కుర్చీ నుంచి దిగిపోతే ఆ స్థానాన్ని తన మద్దతుదారులు లేదా తాను సూచించన వారికే ఇవ్వాలంటూ షరతు విధించారనీ, దీనికి ఆయన మద్దతుదారులైన  ఎమ్మెల్యేలు అండగా నిలించారన్నది ప్రచారం.

ఈ నేపథ్యంలో హస్తినకు వెళ్లి పార్టీ అధినేత్రిని కలిసిన ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. పైగా, ఇపుడు ఆయన సీఎం పదవి సోనియా నిర్ణయంపై ఆధారపడివుంది.

నిన్నామొన్నటివరకు కాంగ్రెస్ పార్టీ కాబోయే జాతీయ అధ్యక్షుడు అశోక్ గెహ్లాటేనని ప్రచారం జరిగింది. ఆయన కూడా బలంగా రేసులో నిలిచారు.కాంగ్రెస్ పార్టీ నియమావళి ప్రకారం ఒకరికి ఒకే పదవి కావడంతో, సీఎం పదవికి రాజీనామా చేసేందుకు గెహ్లాట్ సిద్ధపడ్డారు.

కానీ ఆయన వర్గానికి చెందిన 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడడంతో రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం తలెత్తింది. కొనసాగిస్తే అశోక్ గెహ్లాట్‌నే సీఎంగా ఉంచాలని, లేని పక్షంలో సచిన్ పైలెట్‌కు తప్ప మరెవరికైనా సీఎం పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

గత 2020లో పార్టీలో తీవ్ర సంక్షోభానికి కారణమైన సచిన్ పైలెట్ సీఎం కావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని వారు తేల్చి చెప్పారు. ఈ పరిణామాలతో అశోక్ గెహ్లాట్ ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై అధిష్టానానికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కాదు కదా, ఇటు సీఎం పదవి కూడా పోయే పరిస్థితి వచ్చిపడింది. రాజస్థాన్ సీఎం అంశంపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరో ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.