బహనాగ వద్ద మరమ్మతు పనులు.. 15 రైళ్లు రద్దు
ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ వద్ద జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో 288 మంది మృత్యువాతపడ్డారు. మరో 1100 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. అయితే, ఈ ప్రమాదం తర్వాత ఆ మార్గంలో రైలు పట్టాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో బహనాగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ప్రమాదం తర్వాత యుద్ధప్రాతిపదికన చేపట్టిన పునరుద్ధరణ పనులతో ఇప్పటికే పలు సర్వీసులు కొనసాగుతుండగా.. హౌరా వైపు రాకపోకలు కొనసాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో మొత్తంగా 15 రైళ్లు రద్దు చేస్తున్నట్టు ఓ ప్రటకనలో పేర్కొంది.
ఈ నెల 12న చెన్నై సెంట్రల్ - షాలిమార్ ప్రాంతాల మధ్య నడిచే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలును సర్వీసు సేవలను రద్దు చేశారు. రద్దు చేసిన రైళ్ళలో ఈ నెల 11వ తేదీ ఆదివారం మైసూరు - హౌరా, 12వ తేదీన హౌరా, ఎర్నాకుళం - హౌరా, సంత్రగచ్చి - తంబ్రం, హౌరా - చెన్నై సెంట్రల్ రైలు సర్వీసులను రద్దు చేశారు.
అలాగే, ఈ నెల 13వ తేదీన సంత్రగచ్చి - చెన్నై సెంట్రల్, హౌరా - ఎఎంవీటీ బెంగళూరు, షాలిమార్ - చెన్నై సెంట్రల్, షాలిమార్ - హైదరాబాద్, సికింద్రాబాద్ - షాలిమార్, హైదరాబాద్ - షాలిమార్, విల్లుపురం - ఖరగ్‌పూర్ సర్వీసులు, 14వ తేదీన ఎస్‌ఎంవీటీ బెంగళూరు - హౌరా, భాగల్పూర్ - ఎస్‌ఎంవీటీ బెంగళూరు, షాలిమార్ - సికింద్రాబాద్ సర్వీసులను రద్దు చేసినట్టు ద.మ.రై విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.