శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 20 డిశెంబరు 2021 (19:40 IST)

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా... విశాఖ‌, అర‌కులో ప‌ది డిగ్రీలు!

రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల‌లో గ‌త నాలుగు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమదవుతున్నాయి. ఉదయం కొన్ని ప్రాంతాల్లో పొగమంచుతో రోడ్లు కనిపించక రాకపోకలకు ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి. చ‌లిలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
 
 
హైదరాబాద్‌ బేగంపేట ప్రాంతంలో అత్యల్పంగా 13.2 డిగ్రీలు నమోదైంది. అక్కడితో పోలిస్తే శివారు ప్రాంతాల్లో అంతకన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉంటోంది. నగర శివారు మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో అత్యల్పంగా 8.5, రాజేంద్రనగర్‌లో 9.9 డిగ్రీలే ఉంది. 
 
 
వికారాబాద్‌ జిల్లాలో నాలుగు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మర్పల్లిలో ఆదివారం అత్యల్ప ఉష్ణోగ్రత 8.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సైతం ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలను 20 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
 
 
కోస్తా తీరం వెంబడి తక్కువ ఎత్తులో ఉత్తర గాలులు వీస్తుండడం.. వీటికి అనుబంధంగా రాయలసీమ మీదుగా వీస్తున్న ఈశాన్య గాలులతో ఏపీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. రానున్న 10 రోజుల పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
 
 
ఇక విజయనగరం, విశాఖ, రాయలసీమలోని పశ్చిమ ప్రాంతాల్లో 10 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించారు. చలి గాలులకు తోడు మంచు విపరీతంగా కురుస్తుండటంతో ఉదయం 9 గంటల వరకూ రోడ్లపైకి ప్రజలు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక విశాఖ మన్యంలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లిలో 5.8 డిగ్రీలు, అరకు లోయలో 9.6, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.