గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 జులై 2022 (10:49 IST)

దేశంలో మంకీ పాక్స్ అలజడి.. కేరళలో మూడో కేసు

monkey fox
దేశంలో మంకీ పాక్స్ అలజడి రేపుతోంది. ఇప్పటికే రెండు మంకీ పాక్స్ కేసులు నమోదు కాగా.. తాజాగా మరో వ్యక్తికి కూడా మంకీ పాక్స్ సోకినట్టు గుర్తించారు. మొత్తం మూడు కేసులూ కూడా కేరళలోనే నమోదవడం గమనార్హం. మూడో కేసు నమోదైన వివరాలను కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
 
ఈ నెల 6వ తేదీన యూఏఈ నుంచి కేరళకు వచ్చిన 35 ఏళ్ల యువకుడికి మంకీ పాక్స్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. 
 
కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తికి ఇటీవల చర్మంపై దద్దుర్లు, తీవ్ర జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో వైద్యులు శాంపిల్స్ సేకరించి, ల్యాబ్‌కు పంపగా.. మంకీ పాక్స్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని వెల్లడించారు. 
 
కేరళలో ఇంతకు ముందు బయటపడిన రెండు మంకీ పాక్స్ కేసులకు సంబంధించి బాధితులు విదేశాల నుంచి.. ముఖ్యంగా దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాల నుంచి వచ్చినవారే గమనార్హం. 
 
మంకీ పాక్స్‌లో రెండు రకాలు ఉన్నాయని ఇంతకుముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అందులో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు మొదటి రకానివని, అది మరీ ప్రమాదకరం కాదని పేర్కొంది.
 
అయితే ఆఫ్రికాలోని కాంగోలో బయటపడిన మరో రకం మంకీ పాక్స్ వైరస్ మాత్రం ప్రమాదకరమని.. దానివల్ల 10 శాతం మేర మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది.