బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (18:20 IST)

చెన్నై: శానిటైజ్ చేస్తానంటూ ఏటీఎంలో రూ.8లక్షల చోరీ..

కరోనా వైరస్ కారణంగా చోరీలు పెరిగిపోతున్నాయి. ఏటీఎంను శానిటైజ్ చేస్తానంటూ వచ్చిన ఓ వ్యక్తి ఏటీఎం నుంచి ఎనిమిది లక్షల రూపాయలను దొంగలించాడు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎమ్ఎమ్‌డీఏ రోడ్డులోని ఓ ఏటీఎంను శానిటైజ్ చేస్తానంటూ ఓ వ్యక్తి వచ్చాడు. 
 
ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏటీఎంను శానిటైజ్ చేయాలని చెప్పాడు. అతడి వీపుకు ఉన్న డిస్‌ఇన్ఫెక్టెంట్ యంత్రాన్ని చూసిన ఏటీఎం సెక్యురిటీ గార్డు నిందితుడి చెప్పినదంతా నమ్మి ఏటీఎం లోపలికి అనుమతించి తాను బయట నిలబడ్డాడు.
 
లోపలికి వెళ్లిన నిందితుడు దొంగతనం మొదలెట్టాడు. ఇంతలో మరో వినియోగదారుడు ఏటీఎంలోని వెళ్లాడు. దొంగ డబ్బు కట్టలను సర్దుతుండగా అతడిని బ్యాంకు అధికారి అని పొరబడి బయటకి వచ్చేశాడు. దీంతో దొంగ రూ. 8.2 లక్షలతో బయటికి వచ్చి అప్పటికే అక్కడ ఏర్పాటు చేసుకున్న ఓ ఆటో ఎక్కి పారిపోయాడు. అక్కడే వేచి చూస్తున్న కస్టమర్‌కు అనుమానం రావడంతో అతడు సెక్యురిటీ గార్డుకు చెప్పాడు.
 
ఇద్దరూ కలిసి నిందుతుడి వెంట పడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే చోరి జరిగిన తీరు బట్టి అతడికి బ్యాంకు అధికారుల సహాయం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.