కంగనా రనౌత్ నుంచి పద్మశ్రీ వెనక్కి తీసుకోండి: కేంద్రానికి శివసేన డిమాండ్
1947లో దేశానికి వచ్చిన స్వాతంత్రం ఓ భిక్ష అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉంది. నాటి స్వాతంత్ర ఉద్యమాన్ని కంగనా రనౌత్ అవమానించారంటూ శివసేన అధికారపత్రిక సామ్నా సంపాదకీయంలో విరుచుకపడింది.
స్వాతంత్ర పోరాటవీరులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేయడం దురదృష్టకరమని పేర్కొంది. 1947నాటి దేశ స్వాతంత్రం ఎందరో పోరాటయోధుల త్యాగఫలితమని గుర్తుచేసిన సామ్నా సంపాదకీయం.. వారిని కించపరిచేలా కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. కంగనా రనౌత్‌కు ఇటీవల ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
1947లో దేశానికి వచ్చిన స్వాతంత్రం ఓ భిక్షగా పేర్కొన్న కంగనా రనౌత్.. దేశానికి నిజమైన స్వాతంత్రం నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయిన 2014లోనే వచ్చిందంటూ వ్యాఖ్యానించడం తెలిసిందే.కంగనా వ్యాఖ్యలకు సామ్నా సంపాదకీయం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.
దేశ స్వాతంత్ర పోరాటవీరులను కంగనాలా ఎవరూ కించపరచలేదని సామ్నా అభిప్రాయపడింది. 150 ఏళ్ల పోరాటం తర్వాత విదేశీ బానిసత్వం నుంచి దేశానికి విముక్తి లభించిందని..ఈ పోరాటం వేలాది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది.
రక్తం, స్వేదం, కన్నీరు త్యాగం చేసి సాధించిన స్వాతంత్రాన్ని ఓ భిక్షగా పేర్కొనడం..స్వాతంత్ర వీరులను అవమానించడమేనంటూ సామ్నా సంపాదకీయం అభ్యంతరం వ్యక్తంచేసింది.