1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 4 మే 2022 (21:00 IST)

పడవేయకండి.. దానం చేయండి: నాట్స్ సరికొత్త కార్యక్రమం

Trump
ఇంట్లో పిల్లలు వాడే ఎలక్ట్రానిక్ పరికరాలను కాస్త చిన్న రిపేర్ రాగానే చాలామంది చెత్త బుట్టలో పడేస్తుంటాం. కానీ అలాంటి పరికరాలు కొనలేని శరణార్ధుల పిల్లలు కోట్లాది మంది ఉన్నారు.. ఎప్పుడూ సేవాపథంలో వినూత్నంగా ఆలోచించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ సారి సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది.

 
డోన్ట్ డిచ్ ఇట్, డోనేట్ ఇట్ (పడవేయకండి.. దానం చేయండి) అనే ఈ కార్యక్రమం ద్వారా ఇళ్లలో మైనర్ రిపేర్లు ఉండి వాడకుండా పడేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు (కంప్యూటర్లు, కీబోర్డులు, ఐపాడ్స్, మొబైల్ ఫోన్స్, లాప్‌టాప్స్, కెమెరా, స్పీకర్లు) సేకరిస్తుంది ఇలా సేకరించిన వాటిని నాట్స్ రిపేర్లు చేయించి శరణార్ధుల పిల్లలకు అందించాలని సంకల్పించింది. 

 
గతంలో మేరీ ల్యాండ్‌కు చెందిన12 సంవత్సరాల మిడిల్ స్కూల్ విద్యార్ధిని మన తెలుగమ్మాయి శ్రావ్య అన్నపరెడ్డి ఈ కార్యక్రమాన్ని కోవిడ్ సమయంలో చేపట్టారు. అప్పట్లో  ప్రెసిడెంట్ ట్రంప్ కూడా శ్రావ్య సేవా పథాన్ని కొనియాడుతూ ఆమెను సత్కరించారు. ఇదే స్ఫూర్తిని తీసుకుని నాట్స్  బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజ్ అల్లాడ చొరవతో అమెరికా అంతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. డోన్ట్ డిచ్ ఇట్.. డోనేట్ ఇట్ నినాదంతో ముఖ్యంగా విద్యార్ధులను ఇందులో భాగస్వాములను చేస్తూ ముందుకు సాగనుంది.

 
విద్యార్థి దశలోనే ఈ సమాజానికి నేనేం ఇవ్వగలను అనే బలమైన ఆకాంక్షను విద్యార్ధుల్లో పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి ఈ సందర్భంగా తెలిపారు. సేవాభావంతో పాటు విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలు కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా అలవడతాయని.. సాటి మనిషికి సాయం చేయడంలో కచ్చితంగా తమ వంతు పాత్ర పోషించాలనే బాధ్యత వస్తుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజ్ అల్లాడ అన్నారు. 

 
నాట్స్ అమెరికాలో ప్రతి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళుతుందని నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ విజయశేఖర్ అన్నె తెలిపారు. నాట్స్ వాలంటీర్లు వారి పిల్లలంతా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ముందుకు రావాలని నాట్స్ నాయకులు పిలుపునిచ్చారు. తమకు అవసరం లేదనిపించి ఇంట్లో వాడకుండా ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా విద్యార్ధులు సేకరించి తమకు పంపాలని నాట్స్ పేర్కొంది.