ప్రముఖ రచయిత్రి వసుధారాణితో నాట్స్ ఇష్టాగోష్టి
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణలో భాగంగా నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ద్వారా అంతర్జాల వేదికగా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ ప్రముఖ రచయిత్రి వసుధారాణితో ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. తాను ఎలా రచయిత్రిగా మారారు..? తనకు పుస్తకాలు చదవడం అనేది ఎలా అలవాటుగా మారింది..? తన జీవితంలో అది ఎలాంటి మార్పులు తెచ్చింది..? ఆలోచన ధోరణిని ఎలా మార్చిందనే విషయాలను వివరించారు.
తను వ్రాసిన కవిత సంపుటిలు, కథా సంపుటిల గురించి ఈ వెబినార్‌లో వివరించారు. తెలుగు సాహిత్యం ఎంతో గొప్పదని చలం సాహిత్యం తనపై ప్రభావం చూపిందని ఆమె తెలిపారు. జిడ్డు కృష్ణమూర్తి ఆలోచనల్లో ఈ సమాజాన్ని ఎలా చూడాలి.? మనిషి ఎలా ఉండాలనే విషయాలు బోధపడ్డాయన్నారు. తెలుగు సాహిత్యంపై నేటి తరం కూడా మక్కువ పెంచుకోవాల్సిన అవసరాన్ని వసుధారాణి నొక్కి చెప్పారు. తెలుగు భాష మనందరిని కలుపుతుందని.. ఆ భాష మరింత దేదీప్యమానంగా మారడానికి సాహిత్యం ఎంతగానో దోహపపడుతుందని వసుధారాణి తెలిపారు.
అమెరికాలో ఉండే తెలుగు వారికి తెలుగు సాహిత్య, సంగీత, సాంస్కృతిక ప్రముఖులను పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఆన్‌లైన్ వేదికగా నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ద్వారా ఇష్టాగోష్టి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. ఈ ఇష్టాగోష్టి కార్యక్రమానికి శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ వ్యాఖ్యతగా వ్యవహరించారు. నాట్స్ తెలుగు లలిత కళా వేదికకు వచ్చి తమ విలువైన అనుభవాలను పంచుకున్నందుకు నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని వసుధారాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.