కార్తీక మాసంలో తులసీ మాతకు వివాహ మహోత్సవం జరిపిస్తే..
కార్తీక మాసం పవిత్రమైనది. ఈ మాసంలో ప్రతిరోజూ ఈశ్వరుడిని ధ్యానించే వారికి సకలసంపదలు చేకూరుతాయి. కార్తీక సోమవారం పూట సోమేశ్వరుడైన ఈశ్వరుడిని ధ్యానిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడిని ధ్యానించి.. ఉపవాసముండి.. పంచాక్షరీ మంత్రంతో ఆయన్ని స్తుతించి.. పూజ చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
కార్తీక మాసాన్ని వైష్ణవ సంప్రదాయం ప్రకారం.. దామోదర మాసంగా పిలుస్తారు. దామోదర అనే పేరు.. శ్రీ కృష్ణ పరమాత్మునిది. క్యాలెండర్‌లో ఎనిమిదో మాసమైన కార్తీకంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. గంగానదికి ప్రత్యేక పూజలు తేస్తారు. పవిత్ర స్నానాదికాలు, పూజలు కార్తీక పూర్ణిమతో ముగుస్తాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసీ వివాహ మహోత్సవాన్ని జరిపించే వారికి సర్వం సిద్ధిస్తుంది. ఏకాదశి లేదా పౌర్ణమి రోజుల్లో అదీ కార్తీక మాసంలో తులసీ వివాహ మహోత్సవాన్ని నిర్వహిస్తే.. సర్వాభీష్టాలు నెరవేరుతాయి.
తులసీ మాతకు, షాలిగ్రామ్ స్వామి (విష్ణువు)కి ఈ వివాహాన్ని జరిపిస్తారు. అలాగే భీష్మ పంచక వ్రతాన్ని కొందరు కార్తీక ఏకాదశిలో ప్రారంభించి.. కార్తీక పౌర్ణమి రోజున ముగిస్తారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం భీష్మ పంచక వ్రతం కార్తీక మాసంలో చివరి ఐదురోజులు కూడా పాటిస్తారు. ఈ భీష్మ పంచకను విష్ణు పంచక అని కూడా పిలుస్తారు.
ఇంకా వైకుంఠ చతుర్థి వ్రతం కూడా చతుర్థి తిథి రోజున కార్తీక మాసంలో పాటిస్తారు. ఇది కార్తీక పౌర్ణమికి ఒక్క రోజు ముందే వస్తుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువే.. శివుడిని ఆరాధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అనేక శివాలయాల్లో ఈ పూజను నిర్వహిస్తారు. ఇక త్రిపురాసురుడిని వధించిన కారణంగా కార్తీక పౌర్ణమిని దేవతలందరూ విజయ సూచకంగా జరుపుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున గంగానదిలో వేలాది దీపాలు వెలుగుతూ కాంతులు వెదజల్లుతాయి